యడ్లపాటి వెంకట్రావు ప్రారంభించిన సంగం డెయిరీని వీరయ్య చౌదరి ఎంతో అభివృద్ధి చేశారని చంద్రబాబు అన్నారు. అమూల్ కోసం పాడిరైతులకు ప్రయోజనం చేకూర్చే డెయిరీని నిర్వీర్యం చేయటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న అంశంపై అరెస్ట్ ఎలా చేస్తారని తెదేపా అధినేత మండిపడ్డారు. వీలైతే నాలుగు మంచి పనులు చేయాలి కానీ రైతులకు చెడు చేయటం తగదని హితవు పలికారు.
కక్ష సాధింపులకు సమయమా?
రాష్ట్రం తగలపడుతుంటే ధూళిపాళ్ల నరేంద్ర, పల్లా శ్రీనివాస్‌లపై కక్ష సాధింపులకు సమయమా? అని ముఖ్యమంత్రి జగన్‌పై చంద్రబాబు మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేయడం ఎప్పుడైతే ప్రారంభించారో.. అప్పుడే రాష్ట్రానికి అరిష్టం మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి బతికుంటేనే.. రాజకీయమైనా, మరేదైనా అని హితవు పలికారు. దేశవ్యాప్తంగా ఇస్తున్న వ్యాక్సిన్ కంటే రాష్ట్రంలో తక్కువ వ్యాక్సిన్ రేటు నమోదవటానికి కారణం ఏంటని నిలదీశారు. మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. మెడ్ టెక్ పార్కు ద్వారా దేశం మొత్తానికి వెంటిలేటర్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా.. వ్యవస్థని నాశనం చేశారని ధ్వజమెత్తారు.
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మొండి పట్టుదల వదిలి పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల వారిని ఆర్థికంగా ఆదుకోవాలన్నారు.
ఇదీ చదవండి: వింత: పనస చెట్టుకి జామకాయ!