రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోవడం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసమర్థతకు, లాలూచీకి నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తానంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఊరూరూ తిరిగి హడావుడి చేసిన జగన్ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉండిపోయారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారని ప్రశ్నించారు. తెలుగు సినీ రంగానికి చెందిన హీరోలను, ప్రముఖులను ముఖ్యమంత్రి సమావేశం పేరుతో పిలిపించి అవమానించారని చంద్రబాబు ఆరోపించారు. ‘‘ప్రపంచస్థాయికి వెళ్లిన తెలుగు సినిమా పరిశ్రమను జగన్ తన వైఖరితో కించపరిచారు. లేని సమస్యను సృష్టించి, సినిమా రంగాన్ని అవమానించేలా వ్యవహరించారు. స్వశక్తితో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి వంటివారు, ఇతర సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి చేతులు జోడించి వేడుకోవాలా?’’ అని ఆయన మండిపడ్డారు. చిరంజీవితోపాటు ప్రభాస్, రాజమౌళి, మహేష్‌బాబు తదితరులు పాల్గొన్న ఆ సమావేశంలో జగన్ వ్యవహరించిన తీరు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. సోమవారం ఆన్‌లైన్‌లో జరిగిన పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధానికిచ్చిన వినతిపత్రంలో హోదా అంశమేది?
ప్రధానికిచ్చిన వినతిపత్రంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘కేంద్ర త్రిసభ్య కమిటీ ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడానికి సీఎం జగన్ కృషే కారణమని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీడియాలో వైకాపా నాయకులు డబ్బా కొట్టించుకున్నారు. ఎజెండాలో ఆ అంశం లేకపోయేసరికి... సాయంత్రానికి తెదేపాపై బురదజల్లడం మొదలుపెట్టారు’’ అని ఆయన మండిపడ్డారు.
ఏపీని ఈశాన్య రాష్ట్రాల స్థాయికి తీసుకెళ్లారు?
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబరు వరకు ఆంధ్రప్రదేశ్ 112 సార్లు ఓవర్‌డ్రాఫ్ట్‌కి వెళ్లిందని, 193 సార్లు వేస్ అండ్ మీన్స్ తీసుకుందని, ఏపీని జగన్ వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల స్థాయికి తీసుకెళ్లారని తెదేపా ముఖ్యనేతలు ఆరోపించారు.
* విద్యుత్ రంగంలో రాష్ట్రం మళ్లీ తిరోగమనంలోకి వెళ్లిందని తెదేపా నేతలు దుయ్యబట్టారు. ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్ల ప్రతిపాదనను తిరస్కరించారు. జగన్ కూడా కేసీఆర్‌లా ఎందుకు తిరస్కరించలేదు?’’ అని నిలదీశారు.
* ‘‘ఏపీలో రూ.261 కోట్ల ఉపాధి హామీ నిధులు అవినీతి పాలయ్యాయని పార్లమెంటు స్థాయీసంఘం ప్రకటించింది. మున్ముందు ఈ పథకానికి నిధులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది’’ అని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.
* విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు సీఎం చొరవ చూపాలని, నెల్లూరు సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: