CBN LETTER: తమిళనాడు పీడీఎస్ బియ్యంతో ఏపీ రేషన్ రైస్ మాఫియా చేస్తున్న అక్రమాలపై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏయే రూట్లల్లో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా తరలిస్తోందనే విషయాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్‌కు రాసిన లేఖకు జత చేశారు. తమిళనాడులోని పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా సరిగా లేకపోవడంతో రైస్ మాఫియా రెచ్చిపోతోందని ధ్వజమెత్తారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఏపీలో రైస్ మిల్లర్లకు పంపుతున్నారని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు బియ్యాన్ని పాలిష్ చేసి రైస్ మాఫియాకు పంపి బహిరంగ మార్కెట్‌లో ప్రజలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు. కొంత మొత్తం కర్ణాటకకు కూడా అక్రమంగా తరలిపోతోందని ఆరోపించారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి నిత్యావసర వస్తువుల చట్టం కింద కుప్పంలో దాదాపు 13 కేసులు నమోదయ్యాయని వివరించారు.
స్థానిక ప్రజలు సైతం చాలా మంది స్మగ్లర్లను పట్టుకుంటున్నా.. కేసులు నమోదు కావడం లేదని మండిపడ్డారు. పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతున్నందున తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నిఘా పెంచాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రితో పాటు ఇదే అంశం పై చర్యలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
ఇవీ చదవండి: