ఏడాది కాలంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి దారుణమైన స్థితికి చేరాయని డీజీపీ గౌతం సవాంగ్‌కి చంద్రబాబు లేఖ రాశారు. దోపిడీదారులు, గూండాలు, మాఫియా శక్తులన్నీ ఏకమై ఆంధ్రప్రదేశ్‌ను ఆటవిక రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల వారిపై దాడులే కాకుండా, విచ్చలవిడిగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడటం, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాయడం ద్వారా మొత్తం ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులపై దాడులు పెరిగాయని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు పంచాయతీలో జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై పట్టపగలు దాడి చేయడమే తాజా ఉదంతమన్నారు. ఈ దాడికి పాల్పడింది అధికార పార్టీ వైకాపాకు చెందినవారని.. వాళ్ల పాత్ర బయటకు రానివ్వకుండా పోలీసులే ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలనే ఇద్దరు ఎస్సీలు అనుమానాస్పద మరణం కూడా ఇదే పుంగనూరు నియోజకవర్గంలో జరిగాయని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించే పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఈ దుర్ఘటనలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు.
నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీని చంద్రబాబు కోరారు. వెంకట నారాయణపై దాడి గురించి టీవీ ఛానళ్లలో ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగ్‌లను లేఖతో పాటు జత చేసిన చంద్రబాబు.. లేఖ ప్రతులను చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీకి, అనంతపురం రేంజ్ డీఐజీకి కూడా పంపారు.
ఇదీ చదవండి: సుధాకర్ కేసులో కుట్ర కోణం... విచారణకు మరింత సమయం : సీబీఐ