ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి విజిలెన్స్ నివేదికలో అచ్చెన్నాయుడు పేరే లేనప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నిలదీశారు. వైకాపాలో చేరాలన్న ప్రలోభాలకు లొంగనందుకే ఆయన్ను దొంగదెబ్బ తీసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే, సీఎం జగన్‌కు మాత్రం కక్షసాధింపే ప్రధానంగా మారిందని మండిపడ్డారు. బీసీ నేత అయిన అచ్చెన్నాయుడిని గతంలోనూ అనేక సార్లు అవమానించిన జగన్... వైకాపా అవినీతిపై పోరాడుతున్నందుకే ఆయన పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసిందని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి రోజుకు ఒకటి బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు అవినీతి ఉంటే బయటపెట్టాలని సవాల్ చేసిన తెదేపా నేతలు, ఇపుడెందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. త్వరలో మరిన్ని అవకతవకలను వెలికి తీస్తామన్నారు.