వైకాపా నేతలు ప్రజలను దోచుకుంటూ పొట్టలు పెంచుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లల్లోనూ కక్కుర్తిపడటం దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు. ఇళ్లస్థలాలకు సంబంధించి భూసేకరణలో వైకాపా భారీ అక్రమాలకు పాల్పడుతోందంటూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు వర్చువల్ ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గానికి చెందిన ఇళ్ల లబ్ధిదారులతో చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు. కుప్పం ప్రజలు ఏం పాపం చేశారని ఇళ్లు ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత ఇంట్లో ఉంటున్నామనే ఆత్మగౌరవంతో పేదలు బతికేందుకు పెద్ద ఎత్తున్న తెదేపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. భూ సేకరణ పేరుతో భారీ దోపిడీకి వైకాపా నేతలు తెరలేపారన్న ఆయన.., ఎక్కడికక్కడ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. శ్మశానాలనూ వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రం మొత్తాన్నే కుంభకోణాల మయం చేశారని ధ్వజమెత్తారు. భూమి చదునులోనూ భారీఎత్తున అవినీతికి తెరలేపారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: హైకోర్టు స్టే వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా: మంత్రి రంగనాథరాజు