నాగార్జున సాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యం సరిహద్దు వెలుపల విస్తరించిన రిజర్వు ప్రాంతాలను ఎకో సెన్సిటివ్ జోన్ గా కేంద్ర అటవీశాఖ గుర్తించింది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదాన్ని తెలియచేసింది. పులుల అభయారణ్యం సరిహద్దుల నుంచి మొదలై 2,149 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని కొత్తగా ఎకో సెన్సిటివ్ జోన్ గా గుర్తించినట్టు ఏపీ పీసీసీఎఫ్ ప్రతీప్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్-శ్రీసైలం పులుల అభయారణ్యం 3727.82 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని.. కొత్తగా మరో 2149.68 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా కేంద్రం గుర్తించినట్టు వివరించారు.
అభయారణ్యం సరిహద్దుల నుంచి మొదలై 26 కిలోమీటర్ల దూరం వరకూ ఎకో సెన్సిటివ్ జోన్ ప్రాంతంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని వీటికి కేంద్ర అటవీశాఖ ఆమోదాన్ని తెలియచేసినట్లు ఏపీ పీసీసీఎఫ్ ప్రతీప్ కుమార్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం- 1986 ప్రకారం 47వ ఎకో సెన్సిటివ్ జోన్ గా.. దీనిని నిపుణుల కమిటీ సమావేశంలో ఆమోదించినట్లు తెలిపారు. పులుల అభయారణ్యం సరిహద్దు నుంచి బయట విస్తరించి ఉన్న రిజర్వు ప్రాంతాలు, ఇతర ప్రాంతాలతో కలిపి ఈ జోన్ పరిధి ఉంటుందని స్పష్టం చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్ కారణంగా పులులతో పాటు ఇతర వన్యప్రాణుల స్వేచ్ఛకు, మనుగడకు మరింత సంరక్షణ చేకూరుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: