ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ సీబీఎస్‌ఈ(CBSE) అనుబంధ గుర్తింపు(cbse affiliated to schools in ap) తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన వేళ.. అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే 44 వేల 639 పాఠశాలలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, పురపాలక, రెసిడెన్షియల్ సొసైటీ, సమగ్రశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో కలిపితే 46 వేలకు పైగా పాఠశాలలున్నాయి. వీటన్నింటికీ విడతల వారీగా అనుమతులు లభించేందుకే కొన్నేళ్లు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి బడికీ విశాఖపట్నంలాంటి చోట ఎకరన్నర, ఇతర ప్రాంతాల్లో రెండెకరాల స్థలం ఉండాలనేది నిబంధన. ఇంత విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చాలా తక్కువ. సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు కోసం తొలుత ఒక్కో శాఖ ఒక్కో పాఠశాల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అన్ని రకాల వసతులున్నవి వెతకడం ప్రారంభించారు.
తొలుత వెయ్యి పాఠశాలలకే..
తొలివిడతలో వెయ్యింటికి అనుమతులు ఇచ్చేందుకు సీబీఎస్‌ఈ అంగీకరించిన(Cbse Grant Affiliation to Schools in AP) నేపథ్యంలో 1092 పాఠశాలలతో అధికారులు జాబితాను సిద్ధం చేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలలు, సమగ్ర శిక్ష అభియాన్ కింద నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలే ఎక్కువగా ఉన్నాయి. జిల్లా, మండల పరిషత్తు పాఠశాలలు కేవలం 129 మాత్రమే ఉన్నాయి. రెసిడెన్షియల్ సొసైటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకులాలకు ఎక్కువ భూమి ఉండడంతో వీటిని సీబీఎస్‌ఈ జాబితాలో చేర్చారు.
అన్నింటికీ అనుమతులు దక్కే పరిస్థితులు లేవు
పురపాలకశాఖ పరిధిలోని 335 ఉన్నత పాఠశాలల్లో 61 మాత్రమే మొదటి విడతకు వచ్చాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 6 వేల 668 ఉన్నత పాఠశాలలుంటే.. 129 బడులనే ప్రతిపాదించారు. 164 ఆదర్శ పాఠశాలలు, 352 కేజీబీవీలను తొలి విడతలో పెట్టారు. వీటిలోనూ అన్నింటికి సీబీఎస్‌ఈ అనుమతులు దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. కేజీబీవీల్లో వసతి, పాఠశాల నిర్వహణకు గదుల్లేక కొన్నిచోట్ల తాత్కాలిక రేకుల షెడ్లలో నిర్వహిస్తున్నారు. సీబీఎస్‌ఈ నిబంధనలను భర్తీ చేయని బడులు రాష్ట్ర బోర్డులోనే కొనసాగాలి. ఇదే జరిగితే కొంతమంది విద్యార్థులు సీబీఎస్‌ఈ, మరికొందరు రాష్ట్ర బోర్డు సిలబస్ చదవాల్సి ఉంటుంది.
నిబంధనల మేరకు అవి ఉండాల్సిందే..
సీబీఎస్‌ఈ నిబంధనల(Cbse Guidelines) ప్రకారం ప్రతి పాఠశాలకు గ్రంథాలయం, ప్రత్యేక సైన్సు ప్రయోగశాల, కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి. అగ్నిమాపక భద్రత చర్యలు తీసుకోవాలి. పాఠశాలల వారీగా ప్రత్యేక వెబ్‌సైట్ ఉండాలి. మొదటి విడత పాఠశాలల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసేందుకు వీటన్నింటినీ ఫొటోలు, వీడియోలు తీసి అప్‌లోడ్ చేయాలి. గ్రంథాలయాలు, ప్రయోగశాలలు చాలాచోట్ల అరకొరగానే ఉన్నాయి. కమిషనరేట్లకు తప్ప పాఠశాలలకు ప్రత్యేకంగా వెబ్‌సైట్లు, పోర్టళ్లు లేవు. చాలా బడుల్లో అగ్నిమాపక పరికరాల ఏర్పాటు లేదు. ఇప్పుడు ఇవన్నీ పూర్తి చేసేందుకే కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి.
ఇదీ చదవండి..
11th day: అడ్డుకులు అధిగమిస్తూ.. నిర్బంధాలను సవాల్ చేస్తూ.. జ్వలిస్తున్న మహాపాదయాత్ర!