లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ పేరుతో పార్టీకి కొత్త అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి అధ్యక్షురాలిగా తేజస్విని పొడపాటి, కార్యదర్శులుగా మహేంద్ర, వీరాంజనేయులను నియమించారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి సూచన మేరకు విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. భామి ఫౌండేషన్ ద్వారా చిన్న వయసులోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సమాజహిత కార్యక్రమాలు చేపట్టి మహిళా నాయకురాలుగా తేజస్విని గుర్తింపు తెచ్చుకున్నారని చంద్రబాబు అన్నారు. యువత తమ తమ హక్కులు, భావితరాల భవిష్యత్తు కోసం రాజకీయాలను వేదిక చేసుకోవాలని తేజస్విని ఆకాంక్షించారు.
వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగువారు చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో అరాచకత్వాన్ని నిలువరించి మళ్లీ తెదేపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమవంతు కృషి చేస్తామని అన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగానే తాము ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నతంగా స్థిరపడ్డామని వెల్లడించారు. దేశవిదేశాల్లో ఉన్న తెలుగు వారు సమయానుకూలంగా రాష్ట్ర అభ్యున్నతికి పోరాడేందుకు ఓ వేదిక కల్పించాలని చంద్రబాబును కోరామన్నారు. తమ కోరిక మేరకు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ పేరుతో పార్టీకి కొత్త అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేశారన్నారు.
ఇదీ చదవండి
Ministers Fires On Pawan: 'పవన్ ఆరాటం ప్యాకేజీల కోసమే.. ప్రజల కోసం కాదు'