బ్లాక్ మెయిల్ చేసిన వారికే.. ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవులు ఇచ్చినట్లు వైకాపాలోనే ప్రచారం జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన.. జగన్ బలహీనత కేబినెట్ కూర్పులోనే తేలిపోయిందని విమర్శించారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా అసంతృప్తితోనే ఉందన్నారు. అపరిచితునిలా మారిన జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టమన్నారు. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపంగా మారాయని ధ్వజమెత్తారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం అలుముకుందన్నారు.
నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఎంపీ విజయసాయి రెడ్డి మూడేళ్లు దోచుకున్నారని.. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా? అని నిలదీశారు. పింఛన్ ఒకటో తేదీనే ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛను ఇవ్వటంలేదని దుయ్యబట్టారు.
వీళ్లేం మంత్రులు?
ప్రమాణ స్వీకారం అనంతరం కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు. జగన్‌ను అందరూ ఆరాధించాలని సమాచారశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పడమేమిటని మండిపడ్డారు. కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్ తన ఆర్భాటంతో ఒక పసిబిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమవడమే కాకుండా, నిరసన తెలిపిన తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడా దోపిడీ కోసమేనని ఆయా నేతలు విమర్శించారు. ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వడానికి వాలంటీర్లను పెట్టానని చెప్పిన జగన్... ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్ల్లంకలో బాలికపై వాలంటీర్ అత్యాచారం ఘటనను ఖండించారు.
21 నుంచి సభ్యత్వ నమోదు
తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వెల్లడించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా కూడా కల్పిస్తున్నామన్నారు. ప్రమాదంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా రూ.100 కోట్లు అందజేశామని చెప్పారు. మహానాడు ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై పార్టీ నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయాలు తెలుసుకున్నారు. పొలిట్‌బ్యూరోలో కూడా చర్చించాక మహానాడు ఎక్కడ నిర్వహించేదీ ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
"జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం. జగన్ ఒక అపరిచితుడు.. రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపం. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంతవర్గం కూడా అసంతృప్తితో ఉంది. అపరిచితునిలా మారిన జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం. జగన్ బలహీనత.. కేబినెట్ విస్తరణ చూస్తేనే అర్థమవుతోంది. వైకాపాలో అసంతృప్తి కేబినెట్ విస్తరణ సందర్భంగా బయటపడింది. బ్లాక్‌మెయిల్ చేసిన వారికే పదవులు ఇచ్చినట్లు వైకాపాలోనే ప్రచారం. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి మూడేళ్లు దోచుకున్నారు. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా ? ఒకటో తేదీ అన్నారు.. మొదటి వారంలో కూడా పింఛన్ ఇవ్వట్లేదు. నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి హస్తం." -చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి: మూడేళ్లలో ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టులు... ఎప్పటికప్పుడు గడువు పెంపు!