గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా.. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను దోచుకుంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని జగన్ తన వ్యక్తిగత అజెండాతో సర్వనాశం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ముఖ్యనేతలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. తెదేపా హయాంలో కరెంట్ కోతలు ఎత్తివేసి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాల్ని ప్రజలపై మోపారని విమర్శించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలోనే విద్యుత్ ధరలు అధికమన్నారు. ఏపీలో విద్యుత్ రేట్లు చూసి పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు. పరిశ్రమలు లేకపోతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. పెట్రోల్, డీజిల్, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఇసుక, సిమెంట్, మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా కృంగిపోయారని ఆక్షేపించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంటే.. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ, పన్నులు వేస్తూ జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.
వారి ప్రయోజనం కోసమే..: సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 400 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగం చేసే సంపన్న వర్గాలపై 6 శాతం పెంచి 125 యూనిట్ల లోపు వాడే పేద, దిగువ మధ్యతరగతి ప్రజలపై 57 శాతం ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలు ఎత్తివేసి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని గుర్తు చేశారు. 2014లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో ప్రారంభమైనా.. 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించామని వివరించారు. వ్యవసాయ మోటార్లకు 9 గంటల పాటు కోతలు లేకుండా కరెంట్ ఇచ్చామన్నారు. 2014 నవంబర్ 30 నాటికి రాష్ట్రంలో 14.81 లక్షలు ఉన్న వ్యవసాయ కనెక్షన్లను 2019 మార్చి 31 నాటికి 18.07 లక్షల కనెక్షన్లకు పెంచామని తెలిపారు. తెదేపా ఐదేళ్ల పాలనలో 3.26 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షలు ఇచ్చామని.. సరాసరి ఏడాదికి 65,200 కనెక్షన్లు ఇచ్చామని అన్నారు. జగన్ మూడేళ్లలో ఇచ్చిన వ్యవసాయ కనెక్షన్లు కేవలం 1.17 లక్షలు మాత్రమే అని తెలిపారు.
"గజదొంగలూ ఆశ్చర్యపోయేలా జగన్ దోచుకుంటున్నారు. జగన్ వ్యక్తిగత అజెండాతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మూడేళ్లలో రూ.42,172 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారు. ఏపీలో విద్యుత్ ఛార్జీలు చూసి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు. నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా కుంగిపోయారు.పేదలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సంపన్న వర్గాల లబ్ధి కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తోంది." - చంద్రబాబు, తెదేపా అధినేత
చీకట్లు కమ్మేలా చేశారు: సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం 2018-19లో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 63,143 మిలియన్ యూనిట్ల నుంచి 62,990 మిలియన్ యూనిట్లకు పడిపోయిందని చంద్రబాబు వివరించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. సౌర, పవన విద్యుత్ రంగాన్ని దెబ్బతీశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు సంబధించి కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేశారని మండిపడ్డారు. 7 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇళ్లల్లో స్విచ్ వేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు తెచ్చారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి అసమర్థత, చేతకానితనంతో మిగులు విద్యుత్‌తో ఉన్న రాష్ట్రాన్ని లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్రంలో చీకట్లు కమ్మేలా చేశారని ఆక్షేపించారు.
పక్షపాత ధోరణితో వ్యవస్థ నాశనం: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌ను ప్రభుత్వం వదులుకోవటం విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు దారి తీస్తుందని చంద్రబాబు విమర్శించారు. 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని జగన్ రెడ్డి తన వ్యక్తిగత అజెండాతో, నిరాధారమైన ఆరోపణలతో నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. నాడు దూర దృష్టితో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేస్తే.. నేడు పక్షపాత ధోరణితో వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
విద్యుత్తు ఛార్జీల్లోనూ రాష్ట్రమే టాప్: యనమల
అప్పుల్లోనే కాకుండా.. విద్యుత్తు ఛార్జీల పెంపులోనూ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రజలపై భారాలు వేయడం, వారి నడ్డి విరగ్గొట్టడమే ధ్యేయంగా జగన్‌రెడ్డి మూడేళ్ల పాలన సాగిందని దుయ్యబట్టారు. ‘చంద్రబాబు ముందుచూపుతో పవన, సౌర విద్యుత్తు కొనుగోళ్లకు ఒప్పందాలు కుదుర్చుకుంటే.. జగన్ ఆ ఒప్పందాలు రద్దు చేశారు. దీంతో నేడు అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రజలు మద్యం తాగి ప్రాణాలు కోల్పోకుండా చేసేందుకే మద్యం ధరలు పెంచామన్న జగన్‌రెడ్డి.. నేడు విద్యుత్తు ధరలు పెంపునూ ప్రజల మంచి కోసమే అనేలా ఉన్నారు’ అని యనమల ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: లక్షల కోట్ల అప్పులు చేసి.. మా జేబుల్లో పెట్టుకుంటున్నామా? : మంత్రి బొత్స