రాష్ట్రంలో చక్కెర పరిశ్రమల్లో ఉత్పత్తులను వెంటనే మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని.. మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. చాలా పరిశ్రమలు సామర్థ్యానికి తగ్గట్లుగా పని చేయడం లేదని.. వీటిని మెరుగుపరుచుకునేలా సహకారం అందించాలని ఉపసంఘం నిర్ణయించింది. మరమ్మతులు చేసి, అవసరమైన పరికరాలు సమకూర్చుకోవాలని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ మేరకు మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు నేతృత్వంలో.. విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో చక్కెర కర్మాగారాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై నిర్ణయించింది.
భీమసింగి చక్కెర పరిశ్రమలో పరికరాలు కాలం చెల్లాయని, చోడవరం పరిశ్రమలోనూ సామర్థ్యానికి తగ్గట్లు పని చేయడం లేదని మంత్రులు అభిప్రాయపడ్డారు. జిల్లాలవారీగా చెరకు పంట, ఉత్పత్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఏటికొప్పాక పరిశ్రమపై ఆధారపడిన 4500 మంది చెరకు రైతుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సహకరించాలని మంత్రి వర్గ ఉపసంఘం అధికారులకు సూచించింది. వచ్చేవారం నాలుగు సహకార చెక్కర పరిశ్రమలను సందర్శించి పలు సూచనలు చేయనున్నట్లు మంత్రులు తెలిపారు.
ఇదీ చదవండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం