Book fair at Vijayawada: నేటి నుంచి జనవరి 11 వరకు విజయవాడలో పుస్తక మహోత్సవం జరగనుంది. 32వ పుస్తక మహోత్సవానికి స్వరాజ్ మైదానంలో ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు పుస్తక మహోత్సవాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ ప్రారంభించనున్నారు. పుస్తక మహోత్సవానికి గవర్నర్ రూ.5లక్షలు నిధులు విడుదల చేశారు. 210 స్టాళ్లలో కొత్త పుస్తకాలు 10 శాతం రాయితీతో విక్రయిస్తారు. రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుస్తక మహోత్సవం జరగనుంది.
ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుస్తక ప్రియుల పాదయాత్ర చేపట్టనున్నారు. బాలగంగాధర్ తిలక్, ఆత్రేయ, వడ్డాది పాపయ్య శాస్త్రి, రా.వి.శాస్త్రి శత జయంతి సభలు నిర్వహిస్తారు. పది లక్షల మంది వరకు పుస్తకప్రియులు ఏటా వచ్చి సందర్శించి వెళుతుంటారు. చాలామంది ఏడాదంతా డబ్బులు దాచుకుని మరీ వచ్చి పుస్తక మహోత్సవంలో కొనుగోలు చేస్తుంటారు. గ్రంథాలయాలకు అవసరమైన పుస్తకాలను చాలా విద్యా సంస్థలు ఏడాదికోసారి ఇక్కడే కొనుగోలు చేస్తుంటాయి.
ప్రాంగణం, వేదికలకు పేర్లు ఇవే..
- నవోదయ రామ్మోహనరావు ప్రాంగణం: ఈ ఏడాది పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి రెండేళ్ల క్రితం కాలం చేసిన నవోదయ పబ్లిషర్స్ అధినేత రామ్మోహనరావు పేరు పెట్టారు.
- కాళీపట్నం రామారావు సాహిత్య వేదిక: ప్రధాన సాహిత్య వేదికకు శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు పేరుపెట్టారు. ఈ వేదికపై పుస్తకాల ఆవిష్కరణలు, శత జయంతి సభలు, చర్చాగోష్ఠులు, సంస్కరణ సభలు 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ వరుసగా జరుగుతాయి.
- పుస్తక ప్రియుల పాదయాత్ర.. ఈసారి కూడా పుస్తక ప్రియుల పాదయాత్రను 4న నిర్వహిస్తున్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ నుంచి అలంకార సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డు, విజయాటాకీస్, నక్కల రోడ్డు పైనుంచి పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పాదయాత్ర చేరుకుంటుంది.
ఈ ఏడాది 200 స్టాళ్లు..
స్టేట్‌గెస్ట్ హౌస్ వైపు ప్రధాన మార్గం ఏర్పాటు చేస్తున్నారు. రైతుబజార్ వైపు రెండో మార్గం ఉంటుంది. పుస్తక ప్రియులు ఏ మార్గం నుంచి ప్రవేశించినా మొత్తం స్టాల్స్ అన్నీ సందర్శించి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. పుస్తక మహోత్సవంలో ఈ ఏడాది 200 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. స్టాళ్లలో కేజీ నుంచి పీజీ వరకూ పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. పిల్లలకు సంబంధించిన పుస్తకాలు అధికంగా ఉండబోతున్నాయి. భారతం, రామాయణం, భగవద్గీత, కథల పుస్తకాలు, పంచతంత్రం సహా అన్నీ ఉండబోతున్నాయి. తెలుగు, ఇంగ్లీష్ నవలలు, ఇంజినీరింగ్, మెడికల్ పుస్తకాలు, ఆధ్యాత్మికం సహా అన్ని రకాలూ అందుబాటులో ఉంటాయి.
ఇదీ చదవండి: