రాష్ట్రంలోని ప్రాజెక్టులపై సాగునీటి రంగ నిపుణులతో విస్తృతంగా సమాలోచన చేసి వారి అభిప్రాయాల మేరకు ఓ నివేదికను కేంద్ర జలశక్తిశాఖకు నివేదించేందుకు రాష్ట్ర భాజపా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రాంతాల వారీగా సాగునీటి రంగ నిపుణులు, మాజీ జలవనరుల శాఖ ఇంజినీర్లతో రౌండ్ టేబుల్ సమావేశాల్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో ఓ సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర భాజపా నాయకులు విజయవాడలో మరో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రా మధ్య నెలకొన్న జలవివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తిశాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన సాగు నీటి రంగ నిపుణలు..ఆ నిర్ణయం ముందుకు వెళ్లేలా కేంద్రం బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాయసీమ సహా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు.
నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగకూడదన్న భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.. తెలంగాణ ప్రభుత్వం నీటి రాజకీయాలతో ఏపీకి అన్యాయం చేస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కాలం జలవనరుల శాఖ మంత్రులుగా తెలంగాణకు చెందిన వారే పనిచేశారని గుర్తు చేసిన ఆయన.. తమకి నీటి విషయంలో అన్యాయం జరిగిందని ఇప్పుడు ఆ రాష్ట్ర నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధిలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తోందని.., నీటి విషయంలో రాయసీమకు అన్యాయం జరగకుండా పోరాడుతామన్నారు. తమకి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానమేనని స్పష్టం చేశారు.
ఏపీలో గోదావరి, కృష్ణా, పెన్నా నదులపై అనేక ప్రాజెక్టులు నిర్మించారని, అయితే వాటిని సరైన రీతిలో ప్రభుత్వాలు వినియోగించుకోవటం లేదని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ నారాయణ రాజు అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులకు అవసరాల మేరకు ఒడిశా నుంచి నీరు రావటం లేదన్నారు. ఒడిశా ప్రభుత్వం నదులపై ప్రాజెక్టు నిర్మించి, అధికంగా నీటిని వాడుకోవటంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నీటి కొరత ఏర్పడిందన్నారు. వంశధార బ్యారేజీ ద్వారా 105 టీఎంసీలకు పైగా నీటి కేటాయింపులు ఉంటే..కేవలం 20 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నామని నారాయణ రాజు పేర్కొన్నారు. విశాఖకు పోలవరం తప్ప మరో మార్గంలేదన్న నారాయణ రాజు...ఆ ప్రాజెక్టు పూర్తైయితే 7 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా నీటి సమస్య ఉందన్న నిపుణులు అన్నారు. ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తేవటం శుభ పరిణామమని రాయలసీమ ప్రాజెక్టుల అధ్యయన నిపుణుడు దశరథ రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా నీటిని విడదీయటమే ఈ వివాదాలకు ప్రధాన కారణమన్నారు. రాయలసీమకు చట్టబద్ధంగా 20 లక్షల ఎకరాలకు నీరు రావాల్సి ఉంటే కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందన్నారు.
ఈ నెల 21న ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టుల సమగ్ర వివరాలు, కేంద్ర ఇచ్చిన నోటిఫికేషన్లో సవరణలు ఉంటే కేంద్ర జలశక్తి శాఖకు నివేదిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. రాష్ట్రాలకు రావాల్సిన నీటి విషయంలో రాజకీయాలకు అతితీతంగా పోరాడుతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
CM Jagan Polavaram Tour: ఏదో కట్టాం అన్నట్టు పునరావాస కాలనీలు ఉండొద్దు: సీఎం జగన్