GVL Comments on YSRCP: వైకాపా ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్త పోరాటం చేస్తామని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినాయక ఉత్సవాలపై ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు. వైకాపా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. అన్ని మతాల వారికి సమాన అవకాశాలు కల్పించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాకంఠక పాలనపై రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఐదు వేల ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని జీవిఎల్ తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మోదీ సుపరిపాలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ విస్తరణకు కృషి చేస్తామన్నారు. పొత్తుల మీద ఇప్పుడే చెప్పలేమని.. ప్రస్తుతం పార్టీ విస్తరణ మీద దృష్టి సారించామన్నారు. కేంద్రం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. జనసేన తమ మిత్రపక్షంగా ఉందని.. దానిపై మీడియా రాద్దాంతం చేయొద్దని కోరారు. తమ కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలను పాటిస్తామన్నారు. తెదేపాతో పొత్తు అంశంపై ప్రశ్నించగా సమాదానం దాట వేశారు.
ఇవీ చదవండి: