BJP MP's Fire On YSRCP Govt: జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.లక్షా 40 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. విజయవాడలో జరిగిన భాజపా కోర్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను ఎంపీలు సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, సీ.ఎం. రమేశ్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు.
కేంద్ర పథకాలు తమవిగా వైకాపా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్ విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడం లేదని.. కొన్ని కేంద్ర నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. మరికొన్ని కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వడం లేదని అన్నారు. భారీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు.
చేసిన అప్పులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా.. ఓటు బ్యాంకు, రాజకీయ అవసరాలకోసం మాత్రమే ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరిగిందన్నారు. రాష్ట్ర రాజకీయం, ఆర్థిక పరిస్థితులపై కోర్‌కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు జీవీఎల్ తెలిపారు.
"రెండున్నర ఏళ్లలో రూ.లక్షా 40 వేల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్తున్నారు. కేంద్ర పథకాలకు ఇక్కడి పేర్లు పెట్టుకుంటున్నారు. కొన్ని కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలుకావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం." - జీవీఎల్ నరసింహారావు, భాజపా ఎంపీ
అభివృద్ధిపై దృష్టి లేదు: టీజీ
వైకాపా ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితిలో ఉందని భాజపా ఎంపీ టీజీ మండిపడ్డారు. రాష్ట్రంలో పరస్పర దూషణలు తప్ప అభివృద్ధిపై దృష్టి లేదని ఆక్షేపించారు. కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలపై ఆరోపణలు సరికావని టీజీ హితవు పలికారు.
వైకాపా అవినీతి ప్రజలకు అర్థమైంది: సుజనా
వైకాపా ప్రభుత్వంలోని అవినీతి ప్రజలకు అర్థమైందని భాజపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. తమకు భాజపా ఆశీస్సులున్నాయనే కొందరి వైకాపా నేతల మాటలు అబద్ధమని అన్నారు. వైకాపా మాకు శత్రువు కాదని.. రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని వ్యాఖ్యనించారు.
అప్పులే అడుగుతున్నారు: సి.ఎం. రమేశ్
రాష్ట్రంలో రెండున్నర ఏళ్లుగా అభివృద్ధి శూన్యమని మరో ఎంపీ సి.ఎం.రమేశ్ అన్నారు. కడప స్టీల్‌ప్లాంట్ వద్ద పునాదిరాయే మిగిలిందే తప్ప..మరేం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇసుక, మట్కా, గుట్కా, గంజాయి అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు. వైకాపా ప్రభుత్వ పెద్దలు దిల్లీ వచ్చి ప్రాజెక్టులు కోరడం లేదని, అప్పులే అడుగుతున్నారని సి.ఎం.రమేశ్ దుయ్యబట్టారు.
ఇవీ చదవండి
chandrababu slams on cm jagan: ఓట్లేసిన పాపానికి.. ప్రాణాలే బలిగొంటారా? : చంద్రబాబు