ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక వర్గం వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని మిగతా వారిపై వివక్ష చూపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి సయ్యద్ ఇబ్రహీం విమర్శించారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భాజపా పూర్వ జాతీయ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి సికిందర్ భక్త జయంతి కార్యక్రమం విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. సికిందర్ భక్త చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సయ్యద్ ఇబ్రహీం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వాలు పక్షపాతరహితంగా పాలించాలి, కాని ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆరోపించారు. సమాజంలోని మతాలు, వర్గాలు అందరూ కలసి కట్టుగా అభివృద్ధి సాధించాలనేది భాజపా అభిమతమని చెప్పారు. అందుకే సబ్ కా సాత్, సబ్ కా వికాస్.... సబ్ కా ప్రయాస్ అనేది భాజపా నినాదంగా మారిందని వివరించారు. ఎన్నో పార్టీలున్నా భాజపా మాత్రమే మైనార్టీలను అక్కున చేర్చుకుని ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కేంద్రమంత్రి వర్గంలో మైనార్టీలకు నాలుగు మంత్రి పదవులు లభించాయని చెప్పారు.
ఇదీ చదవండి: 'చికెన్ ఫ్రై' బాగా వండలేదని భార్యను చంపేశాడు!