BJP Veerraju on TTD : హిందుత్వం అంటే వ్యాపారం కాదని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. దేవాలయాలను ఆదాయం కుమ్మరించే కేంద్రాలుగా తితిదే చూస్తుండటం అత్యంత బాధాకరమన్నారు. ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశంలో సేవా టికెట్ ధరల భారీ పెంపుపై జరిగిన చర్చను సోము తప్పుబట్టారు. బోర్డు పరిపాలన ధర్మబద్ధంగా ఉండాలని హితవు పలికారు.
Srivari Seva tickets issue: తిరుమలేశుడి ఆర్జిత సేవల టికెట్లను పెంచాలని తితిదే నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న ధరలను నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచాలని దేవస్థాన ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. సుప్రభాత సేవను రూ. 8వందల నుంచి రూ. 2 వేలకు.. అదే విధంగా కళ్యాణోత్సవం, అర్చన, తోమాల సేవలను రూ. ఐదువేలకు పెంచాలని తీర్మానం చేశారు. సిఫార్సు లేఖలతో ఆర్జిత సేవలు కోరుకునే భక్తులపై అధిక భారం మోపడం తప్పేమీ కాదని ఛైర్మన్ చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని భక్తులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలను ఒకేసారి ఐదు రెట్లు పెంచడంతో స్వామి వారి దర్శనం సాధారణ భక్తులకు భారంగా మారుతుందంటున్నారు. ధార్మిక సంస్థ తితిదేను వ్యాపార సంస్థగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుతోపాటు ఇప్పటికే తిరుమలలో వసతిగృహాల అద్దెలను భారీగా పెంచారు. మరో వైపు లడ్డూ ప్రసాదాలను సైతం రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. గడచిన మూడేళ్లలో తిరుమలలో అన్ని ధరలు పెరగడం తప్ప. భక్తులకు మౌలిక సదుపాయాలు మాత్రం మెరుగుపడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వైకాపా ఆర్థిక అరాచకం.. ప్రజలకు తెలియకుండానే వారిపై అప్పు భారం: తెదేపా