వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, విశాఖ స్టీలుప్లాంటు ప్రైవేటీకరణను నిరసిస్తూ శుక్రవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. వామపక్షాలు, తెదేపా, కాంగ్రెస్ పార్టీలతో పాటు.. రైతు, ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాలు బంద్‌లో పాల్గొని నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించింది. బంద్‌కు మద్దతు తెలిపి, ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం వరకు నిలిపేస్తున్నట్లు ముందే ప్రకటించడంతో 11,500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్‌తో జనజీవనం స్తంభించింది. బ్యాంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు.
చాలావరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను కూడా మధ్యాహ్నం వరకు తెరవలేదు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ ఆయా పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ ఎన్‌జీవో సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని పంచాయత్‌రాజ్ శాఖ ఈఎన్‌సీ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు. విద్యుత్ ఉద్యోగుల ఐకాస పిలుపు మేరకు సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసనలు తెలిపారు.
- విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ఎదుట సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు, రైతుసంఘాల నేత, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు తదితరులు నిరసన చేపట్టారు. గొల్లపూడి సెంటర్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. హనుమాన్ జంక్షన్, గన్నవరం వద్ద జాతీయ రహదారులపై వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఏపీ లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో బెంజి సర్కిల్‌లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
- విశాఖలో బంద్ ప్రశాంతంగా జరిగింది. జాతీయ రహదారిపై వామపక్షాలు, ప్రజాసంఘాలు, కార్మికసంఘాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. కొవిడ్ వారియర్స్ జీతాలు చెల్లించాలనే డిమాండ్‌తో వామపక్షాల నేతలు కేజీహెచ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్సు వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళంలో, విజయనగరం జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. పార్వతీపురంలో రాస్తారోకో చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టుచేశారు.
- కాకినాడలోని బాలాజీ చెరువు కూడలి నుంచి కలెక్టరేట్ వరకు మహిళా కార్మికులు ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు వద్ద జాతీయ రహదారిపై జిల్లా రైతుసంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి.
- గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. నగరంలో ప్రధాన రహదారులు మీదగా వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మధ్యాహ్నం వరకు బంద్ ప్రశాంతంగా సాగింది.
- తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సులకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. కర్నూలులో జాతీయ రహదారి-44ని దిగ్బంధించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతపురంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పాల్గొన్నారు. కడపలోని కోటిరెడ్డి కూడలిలో తెదేపా నేతలు రహదారిపై అల్పాహారం చేసి నిరసనలు తెలిపారు.
ఇదీచదవండి