ap mlc candidates : రాజ్యసభకు వైకాపా తరఫున నామినేషన్లు దాఖలు చేసిన నలుగురు అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలతోపాటు నమోదైన కేసుల వివరాలను ఎన్నికల సంఘానికి బుధవారం అఫిడవిట్ రూపంలో సమర్పించారు. వాటిల్లో పొందుపరచిన వివరాల ప్రకారం.. ఎంపీ విజయసాయిరెడ్డిపై 8 ఈడీ, 11 సీబీఐ కేసులున్నాయి. నలుగురు అభ్యర్థులూ కోటీశ్వరులే. వీరిలో బీద మస్తాన్‌రావు కుటుంబ ఆస్తుల విలువ అత్యధికంగా రూ.243 కోట్లుండగా.. బీసీ నేత ఆర్.కృష్ణయ్య తన ఆస్తుల విలువను రూ.3.50 కోట్లుగా పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో రెండో నిందితుడుగా (ఏ-2) ఉన్న విజయసాయిరెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు- 8, సీబీఐ కేసులు- 11 ఉన్నాయి. వాటిలో ఆయన ప్రస్తుతం న్యాయ విచారణ ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లతోపాటు నేరపూరిత కుట్ర, మోసం తదితర సెక్షన్ల కింద ఆయనపై కేసులున్నాయి.
తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 21.57 కోట్లుగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ, వ్యవసాయేతర, నివాస భవనాల విలువ రూ. 21.42 కోట్లుగా ఉంది. భార్య సునందారెడ్డి వద్ద 1,456 గ్రాముల బంగారం, రూ.2.90 కోట్ల విలువైన వజ్రాలున్నాయి. రూ.24.65 లక్షల రుణాలున్నాయి.
బీద మస్తాన్‌రావు: బీద మస్తాన్‌రావు కుటుంబానికి రూ.243 కోట్ల ఆస్తులు, రూ.85 కోట్ల అప్పులున్నాయి. ఇందులో స్థిరాస్తుల విలువ రూ.93 కోట్లు, చరాస్తుల విలువ రూ. 150 కోట్లుగా తెలిపారు. తన పేరుతో రూ.120.72 కోట్లు, భార్య మంజుల పేరుతో 19.85 కోట్లు, హిందూ అవిభాజ్య కుటుంబం కింద తన పేరుతో రూ. 9.43 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.
ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.93 కోట్ల విలువైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస, వాణిజ్య భవనాలున్నాయి. 7,597 గ్రాముల బంగారం, 7,825 గ్రాముల వెండితోపాటు వజ్రాల విలువ రూ.8.02 కోట్లుగా పేర్కొన్నారు. ఎగుమతి పన్నులకు సంబంధించి న్యాయ వివాదంలో ఉన్న రూ. 16.21 కోట్ల అప్పులు, బ్యాంకు రుణాలుగా రూ.69 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.
నిరంజన్‌రెడ్డి: న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి మొత్తం తమ కుటుంబ స్థిర, చరాస్తుల విలువను రూ.75.91 కోట్లుగా, బ్యాంకు రుణాలను రూ.10.99 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరుతో రూ.32.48 కోట్లు, భార్య వైదేహిరెడ్డి పేరుతో రూ.9.17 కోట్లు, తన పేరుతో హిందూ ఉమ్మడి అవిభాజ్య కుటుంబం కింద రూ.67.07 లక్షలు, కుమార్తె అక్షరరెడ్డి పేరుతో 1.13 కోట్ల విలువైన చరాస్తులున్నాయని వెల్లడించారు. ఇందులో 4,273 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. తన పేరుతో బీఎండబ్ల్యూ, ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్, భార్య పేరుతో మెర్సిడెస్ బెంజ్ కార్లున్నాయి.
ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వారసత్వంగా వచ్చిన భూమి విలువ రూ.14.04 కోట్లు, తన పేరుతో రూ.15.81 కోట్లు, భార్య పేరుతో రూ.3.01 కోట్లు, తన పేరుతో హిందూ అవిభాజ్య కుటుంబం కింద రూ.4.72 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. తన పేరుతో సాగర్ కన్వెన్షన్ బిజినెస్ సెంటర్లో 70% వాటా, భార్య వైదేహిరెడ్డి పేరుతో నిరంజన్ అసోసియేట్స్ ఎల్‌ఎల్‌పీలో 34% వాటాలున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ చిరునామాగా పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్‌లో వివరించారు.
ఆర్.కృష్ణయ్య: రాజ్యసభ సభ్యుడిగా వైకాపా తరఫున నామినేషన్ వేసిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య తన కుటుంబ ఆస్తుల విలువ రూ.3.50 కోట్లుగా, రుణాలు రూ.39.26 లక్షలుగా పేర్కొన్నారు. తన పేరుతో ఇన్నోవా కారు, భార్య పేరుతో మరో కారు ఉన్నట్లు వివరించారు. భార్య శబరి వద్ద రూ.14 లక్షల విలువైన 280 గ్రాముల బంగారం, తనవద్ద రూ.2 లక్షల విలువైన 40 గ్రాముల బంగారం ఉందని తెలిపారు.
ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం తన పేరుతో రూ. 1.05 కోట్లు, భార్య పేరుతో రూ.1.95 కోట్ల విలువైన నివాస భవనాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఉన్నాయని వివరించారు. వివాదంలో ఉన్న ప్రభుత్వ అప్పుల విలువ రూ.43.86 లక్షలుగా తెలిపారు.
ఇదీ చదవండి: