Ayesha Meera parents Letter to CJI: ఆయేషా మీరా తల్లిదండ్రులు.. సీజేఐ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తమ కుమార్తె అత్యాచారం, హత్య జరిగి 14 ఏళ్ళు గడిచినా.. ఇప్పటికి తమకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 2008లో ఆయేషా కేసులో నార్కో ఎనాలసిస్ చేయాలని హైకోర్టు ఆదేశించినా.. దాన్ని జరగనివ్వలేదన్నారు.
ఆ తర్వాత మహిళా సెషన్స్ కోర్టులో ఉన్నకేసుకు సంబంధించిన ప్రాపర్టీని తగలబెట్టారని చెప్పారు. తగలబెట్టిన వారికి ఎందుకు శిక్ష వేయలేదని ప్రశ్నించారు. సీబీఐ ఆధ్వర్యంలో 2018లో విచారణ చేపట్టారని.. విచారణలో భాగంగా ఖననం చేసిన ఆయేషా శరీర భాగాలను పరీక్షల కోసం సీబీఐ అధికారులు తీసుకెళ్లారని, మూడు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ ఆ బాడీ పార్ట్స్‌ని ఇవ్వకపోగా.. కేసులో పురోగతి లేదని వాపోయారు.
తమ కుమార్తె ఘటన తర్వాత దిశ లాంటి ఘటనలు జరిగాయని, ఆ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేశారని గుర్తు చేశారు. తన కుమార్తె కేసులో అలాంటి న్యాయం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా.. తమ కుమార్తె హత్యకేసులో ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ కేసుపై ప్రత్యేక చొరవ చూపి, తమకు న్యాయం చేయాలని బహిరంగ లేఖలో కోరారు. అసలైన దోషులకు కఠినమైన శిక్ష వేయాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :
'నిందితులను శిక్షించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి'