MINISTER SURESH: పట్టణాల్లో ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమించడంతోపాటు.. వాటిలో దర్జాగా భవనాలు నిర్మిస్తున్నారని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష’ ప్రాజెక్టు అమలులో భాగంగా.. పట్టణాల్లో నిర్వహించే భూముల రీసర్వేపై అవగాహన కోసం విజయవాడలో నిర్వహించిన పుర కమిషనర్ల సదస్సులో మంత్రి మాట్లాడారు. పట్టణాల్లో వందేళ్ల తరువాత నిర్వహిస్తున్న భూముల రీసర్వేతో ప్రభుత్వ భూముల కబ్జాలకు కాలం చెల్లుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇళ్లు, భవనాలు, స్థలాలపై యాజమాన్య ధ్రువపత్రాలు జారీకి చేసే ప్రయత్నం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
శాశ్వత భూ హక్కు-భూరక్ష ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.140 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. నగరాలు, పట్టణాల్లోని ఇళ్లు, ఖాళీ స్థలాలకు ఆస్తి యాజమాన్య ధ్రువపత్రం జారీ చేసే ప్రాజెక్టును ఏ విధంగా అమలు చేయాలి? ప్రాథమికంగా ఎదురయ్యే ఇబ్బందులకు ఎలా అధిగమించాలి? కార్యాచరణ ప్రణాళిక తయారీ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు.
"వందేళ్ల తరువాత పట్టణాల్లో చేస్తున్న రీసర్వేతో ప్రజలకు, పట్టణ స్థానిక సంస్థలకు ఎంతో ఉపయోగం. హక్కుదారులు ఎవరో తెలియని ఖాళీ స్థలాలను సర్వేలో గుర్తించొచ్చు. ఆస్తులకు యాజమాన్య ధ్రువీకరణ పత్రాల జారీతో ప్రజలకు భరోసా కల్పించినట్లవుతుంది" అని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి అభిప్రాయపడ్డారు.
"పట్టణాల్లో ఇళ్లు, భవనాలు, ఖాళీ స్థలాలకు ఆస్తి పన్ను విధిస్తున్నపుడు ఇప్పటివరకు అసెస్‌మెంట్ నంబర్లు కేటాయిస్తున్నాం. భూముల రీసర్వే పూర్తయ్యాక సర్వే నంబరు, అసెస్‌మెంట్ నంబరు, ఆస్తి వివరాలు, యజమాని పేరు, ఆధార్, మొబైల్ నంబరు సహా యాజమాన్య ధ్రువపత్రం జారీ చేస్తాం. 123 పుర, నగరపాలక సంస్థల్లో త్వరలో భూముల రీసర్వే ప్రారంభం కానుంది. 2023 జులై నాటికి ఇది పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం" అని పురపాలకశాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ వివరించారు.
ఇవీ చదవండి: