Thalassemia Day: పిల్లల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధి తలసేమియా. బిడ్డ పుట్టిన నెలల వ్యవధిలోనే బయటపడే ఈ వ్యాధి వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారుతోంది. కొందరికి నెలకు మూడుసార్లు రక్తమార్పిడి చేస్తేకానీ బతికే పరిస్థితి ఉండదు. పిల్లల భవిష్యత్తు వారి తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన పెంచుతోంది. రోజువారీ కూలీపనులు చేసుకునేవారి కుటుంబాల్లోనే అధికంగా తలసేమియా బాధితులు ఉన్నారు. పిల్లల వైద్యం కోసం నెలకు కనీసం పదివేలు రూపాయలు ఖర్చవుతోంది. రక్తదాతల కోసం తిరగాల్సివస్తోంది. తలసేమియా వ్యాధి బారినపడ్డ పిల్లలు చురుగ్గా ఉండలేకపోవడం, త్వరగా నీరసించడాన్ని.. తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. మిగతా పిల్లల్లా... వయసుకు తగ్గట్లు ఎదగకపోవడం కూడా తల్లిదండ్రును మరింత కుంగుబాటుకు గురిచేస్తోంది.
తమ బాబుకు ఏడాదిన్నర వచ్చేవరకూ తలసేమియా ఉన్నట్లు గుర్తించలేదని.. అమలాపురానికి చెందిన పరుశురాం తెలిపారు. అప్పులు చేసి మరీ వైద్యం చేయించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రపంచ తలసేమియా దినం పురస్కరించుకుని బాధితులు, తల్లిదండ్రుల్లో ధైర్యం నింపేందుకు విజయవాడలో శనివారం ఓ కార్యక్రమం నిర్వహించారు. వ్యాధి నివారణ, వైద్యం సహా అనేక అంశాలపై చర్చించారు. సప్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు తోడ్పాటుగా నిలుస్తున్నాయని.. తలసేమియా బాధిత బాలల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి: శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి