కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర పావనిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈనెల 5 న జరగనున్న సమావేశ ఫలితం తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, తూర్పుగోదావరి కలెక్టర్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కార్పొరేటర్లు సీహెచ్ వెంకట సత్యప్రసాద్, విరామచంద్రరావులకు నోటీసులు జారీచేసింది. విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడాన్ని సవాలు చేస్తూ మేయర్ పావని హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపు న్యాయవాది రఘు వాదనలు వినిపిస్తూ.. పదవీ కాలం నాలుగేళ్లు పూర్తికాకముందే అవిశ్వాస నోటీసు చెల్లదన్నారు. పిటిషనర్‌కు తీర్మాన నోటీసు అందలేదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ కార్పొరేటర్‌గా ఎన్నికై నాలుగేళ్లు పూర్తయిందన్నారు. నిబంధనల ప్రకారం కలెక్టర్ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారన్నారు. అధికారులు నోటీసులు అందజేయడానికి ఇంటికెళ్లితే పావని కుటుంబ సభ్యులు తిరస్కరించారన్నారు. దీంతో ఇంటికి అంటించారని తెలిపారు.