రాష్ట్రంలో నేటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. మెుదట కేవలం 1683 బస్సులను మాత్రమే రోడ్డెక్కించాలని ఆర్టీసీ నిర్ణయించింది. పరిస్థితిని బట్టి బస్సుల సంఖ్యను క్రమంగా పెంచనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా బస్టాండ్లు, బస్సుల్లో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. కండక్టర్లు లేకుండా బస్సులు నడపడం, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ తప్పనిసరి చేశారు. బస్టాండ్లు, బస్సుల్లో నిరంతరం రసాయనాల శుద్ధి, ప్రయాణికులకు శానిటైజర్‌తో చేతులు శుబ్రపరచుకోవడం, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడాన్ని తప్పనిసరిగా అమలు చేయనున్నారు. బస్సుల్లో సీట్ల సంఖ్య తగ్గించినా... ఛార్జీలు పెంచకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని ఆర్టీసీ ఎండీ సూచించారు.
లాక్ డౌన్ తో 58 రోజులుగా డిపోలకే పరిమితమైన బస్సులు.. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రోడ్లెక్కనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉండటంతో ఆ మధ్య సమయంలోనే నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. దూరప్రాంత బస్సులు రాత్రి వేళల్లో నడవనున్నాయి. రాత్రి 7 గంటలలోపే బస్టాండ్లకు ప్రయాణికులు చేరుకోవాల్సి ఉంటుంది. బస్సులు నడిపేందుకు నిర్ణయించిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు.
- రెడ్ జోన్లలోనూ తిరుగుతాయి
ఆర్టీసీకి 12 వేల బస్సులుండగా 17 శాతం బస్సులు మాత్రమే తొలుత రోడ్డెక్కిస్తామని 436 రూట్లలో 1683 బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ బస్సులు తిరగవని స్పష్టం చేశారు. రెడ్ జోన్లలోనూ బస్సులు తిరుగుతాయని.. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం తిరగవన్నారు. పరిస్థితిని బట్టి బస్సుల సంఖ్య క్రమంగా పెంచుతామన్నారు. ఆయా రాష్ట్రాల నుంచి అనుమతి లేని కారణంగా తెలంగాణ సహా ఇతర పొరుగు రాష్ట్రాలకు బస్సులు నడపడం లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది.
- నో కండక్టర్స్
ప్రయాణికులు సహా సిబ్బంది కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఆన్ బోర్డు కండక్టర్లు లేకుండా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏ బస్సుల్లోనూ కండక్టర్లు ఉండరు. బస్టాండ్లు సహా నిర్ణీత ప్రాంతాల్లో స్టాపుల్లో ఉండి ప్రయాణికులకు టికెట్లు జారీ చేస్తారు. లాక్ డౌన్ అనంతరం చైనా, బీజింగ్ సహా ఇతర దేశాల్లో బస్సు సర్వీసులు నడిపే విధానంపై అధ్యయనం చేసి ఈ మేరకు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ఎండీ తెలిపారు. అయితే కండక్టర్లను ఎక్కడా తొలగించడం లేదని ఎండీ స్పష్టం చేశారు. పేపర్ లేకుండా టికెట్ జారీ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. కరెన్సీ నోట్ల వినియోగం తగ్గిస్తూ నగదు రహిత విధానంలో టికెట్ జారీ చేయాలని భావిస్తోంది.
- టికెట్లు ఆన్లైన్లోనే
ఆన్ లైన్ రిజర్వేషన్ ద్వారా మాత్రమే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ ,డీలక్స్ సహా అని దూర ప్రాంతాల బస్సులను ఆన్ లైన్ రిజర్వేషన్లో పొందుపరిచారు. అన్ని వ్యాలెట్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు, సహా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. త్వరలో ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను తీసుకువచ్చి వాటి ద్వారా అన్ని బస్టాండ్లు, బస్టాపుల్లో ఎస్ఎంఎస్ రూపంలో టికెట్ జారీ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు ఎండీ తెలిపారు. టికెట్ జారీ సమయంలో ప్రయాణికుడి వివరాలు, ఫోన్ నెంబర్ తప్పక నమోదు చేస్తారు. వివరాలు, ఫోన్ నెంబర్ ఇస్తేనే టికెట్లు జారీ చేస్తారు. ప్రయాణికుల వివరాలను 15 రోజుల పాటు భద్ర పరుస్తారు. బస్సు ప్రయాణం అనంతరం ఏదేని కారణాలతో ప్రయాణికులను గుర్తించేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు.
- కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి
ప్రయాణికులు బస్సెక్కే ముందు శానిటైజర్‌తో చేతులు కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఈ మేరకు బస్టాండ్లలో చేతులను శుభ్రపరిచే ఆటో మేటిక్ శానిటైజర్ యంత్రాలను అందుబాటులో ఉంచనున్నారు. అందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. నాణ్యమైన మాస్కు ను 10 రూపాయలకు మించకుండా అమ్మేలా చర్యలు తీసుకున్నట్లు ఆర్టీసీ తెలిపింది. పక్కపక్కనే సీట్లు లేకుండా భౌతికదూరం పాటించేలా ఏర్పాటు చేశారు. కొన్ని సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో బస్సుకు 10వేలు ఖర్చు చేసి సీట్లు తొలగించి దూరంగా ఏర్పాటు చేశారు.
- 10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లపైన వృద్ధులు జాగ్రత్త
ఆర్డినరీ బస్సుల్లో 46 సీట్లుండగా వీటిలో 35 సీట్లలో ప్రయాణికులను అనుమతిస్తారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 50 సీట్లలో కేవలం 30 సీట్లలో, ఆల్ట్రా డీలక్స్‌లో 40సీట్లుండగా... వీటిలో 29సీట్లకే అనుమతిస్తారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 36సీట్లుండగా వీటిలో 26సీట్లకే ప్రయాణికులను అనుమతిస్తారు. సీట్ల సంఖ్య తగ్గినా బస్సు ఛార్జీలు పెంచబోమని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బస్సు ప్రయాణం కొంత ప్రమాదకరమేనని... 10ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లపైన వృద్ధులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయవద్దని ఆర్టీసీ ఎండీ సూచించారు. ఏసీ బస్సుల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందనే హెచ్చరిక దృష్ట్యా బస్సులో ఉష్ణోగ్రతను 26 డిగ్రీలు ఉంచనున్నారు.
ఇదీ చదవండి: ఈ అర్ధరాత్రి నుంచి ఓఆర్ఆర్పై వాహనాలకు అనుమతి