వైకాపాలో పదవుల పంపకాలు పూర్తయ్యాయి. 11మందికి పార్టీ ప్రాంతీయ సమన్వయ బాధ్యతలు అప్పగించగా, 26 జిల్లాలకూ కొత్త అధ్యక్షులను నియమించారు. ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తగా విశాఖ కేంద్రంగా వెలిగిన విజయసాయిరెడ్డిని ఆ పదవినుంచి తప్పించారు. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు 37 మందిలో పార్టీపరంగా పదవి దక్కింది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌కు మాత్రమే. మిగిలిన పదవులు మంత్రులు, తాజా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప మేయర్ కె.సురేష్‌బాబు, విజయనగరం జడ్పీ ఛైర్మన్ చిన్నశ్రీనులకు దక్కాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 4జిల్లాలు, వాటి పరిధిలోని 27 నియోజకవర్గాల బాధ్యతలనిచ్చారు. ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డికి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని 5 జిల్లాలు, వీటి పరిధి 35 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. ఈ తండ్రీకుమారులకు మొత్తంగా 9 జిల్లాలు, వాటి పరిధిలోని 62 నియోజకవర్గాల బాధ్యతలను ఇచ్చినట్లయింది. అయితే మిథున్ పర్యవేక్షించనున్న 5 జిల్లాల్లో ఆయనకు తోడుగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కూడా సమన్వయకర్తగా ఉంటారు. 11మంది ప్రాంతీయ సమన్వయకర్తల్లో ఆరుగురు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం గమనార్హం. సామాజిక సమీకరణల్లో భాగంగా బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్, బోస్, కొడాలి, మర్రి రాజశేఖర్‌లకు ప్రాంతీయ సమన్వయ బాధ్యతలిచ్చినట్లు వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముగ్గురు మహిళలకు జిల్లా అధ్యక్ష పదవులనిచ్చారు.
సజ్జలకు పెరిగిన బాధ్యతలు
అధికార పార్టీలో ముఖ్యమంత్రి జగన్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తోంది ఎంపీ విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలే! ఇప్పుడు పదవుల పంపకాల్లో ఆ ముగ్గురిలో సజ్జలకు బాధ్యతలు పెరిగాయి. ఆయన 2జిల్లాలకు నేరుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలిసి ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. దీంతోపాటు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలందరినీ, జిల్లాల అధ్యక్షులను సజ్జల సమన్వయం చేస్తారు. వైవీకి విశాఖపట్నం-అనకాపల్లి-అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా ఎంపీ విజయసాయి ఇంతకాలం అధికారికంగా, అనధికారికంగా అజమాయిషీ చేశారు. ఆయన తీరుపై ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరిలో అసంతృప్తి బహిరంగమైన సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన్ను ఉత్తరాంధ్ర బాధ్యతలనుంచి తప్పించారు.
ముగ్గురు తాజా మాజీలకు ప్రాంతీయ బాధ్యతలు
పునర్‌వ్యవస్థీకరణలో మంత్రి పదవులు కోల్పోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్‌లకు పార్టీ ప్రాంతీయ సమన్వయ బాధ్యతలనిచ్చారు. మిగిలిన 10మందికి వారి జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను కట్టబెట్టారు. ఇప్పటివరకు ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరించిన విజయసాయి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలలో విజయసాయి, మోపిదేవిలను పూర్తిగా ‘ప్రాంతీయ’ బాధ్యతలనుంచి తప్పించారు. వేమిరెడ్డిని నెల్లూరు జిల్లాకు, మోపిదేవిని బాపట్ల జిల్లాకు పరిమితం చేశారు. సజ్జలకు గతంలో ఉన్న కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల స్థానంలో కర్నూలు, నంద్యాల ఇచ్చారు.
- మంత్రి పదవులు ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు పార్థసారథి, ఉదయభాను, శిల్పా చక్రపాణిరెడ్డిలు ఇప్పటివరకు వారికున్న పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను కోల్పోయారు.
ప్రాంతీయ సమన్వయకర్తలు
చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కర్నూలు, నంద్యాల: మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
వైఎస్సార్, తిరుపతి: అనిల్‌కుమార్‌యాదవ్
నెల్లూరు, ప్రకాశం, బాపట్ల: బాలినేని శ్రీనివాసరెడ్డి
గుంటూరు, పల్నాడు: కొడాలి నాని
ఎన్టీఆర్, కృష్ణా: మర్రి రాజశేఖర్
ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ: ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు: వైవీ సుబ్బారెడ్డి
పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం: మంత్రి బొత్స సత్యనారాయణ
జిల్లాల పార్టీ అధ్యక్షులు
చిత్తూరు: కేఆర్‌జే భరత్
అనంతపురం: కాపు రామచంద్రారెడ్డి
శ్రీసత్యసాయి: ఎం.శంకరనారాయణ
అన్నమయ్య: గడికోట శ్రీకాంతరెడ్డి
కర్నూలు: వై.బాలనాగిరెడ్డి
నంద్యాల: కాటసాని రాంభూపాల్‌రెడ్డి
వైఎస్సార్: కె.సురేష్‌బాబు
తిరుపతి: చెవిరెడ్డి భాస్కరరెడ్డి
నెల్లూరు: వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి
ప్రకాశం: బుర్రా మధుసూదన్‌యాదవ్
బాపట్ల: మోపిదేవి వెంకటరమణ
గుంటూరు: మేకతోటి సుచరిత
పల్నాడు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ఎన్టీఆర్: వెలంపల్లి శ్రీనివాసరావు
కృష్ణా: పేర్ని వెంకట్రామయ్య(నాని)
ఏలూరు: ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)
పశ్చిమగోదావరి: చెరుకువాడ శ్రీరంగనాథరాజు
తూర్పుగోదావరి: జక్కంపూడి రాజా
కాకినాడ: కురసాల కన్నబాబు
కోనసీమ: పొన్నాడ వెంకట సతీష్‌కుమార్
విశాఖపట్నం: ముత్తంశెట్టి శ్రీనివాసరావు
అనకాపల్లి: కరణం ధర్మశ్రీ
అల్లూరి సీతారామరాజు: కె.భాగ్యలక్ష్మి
పార్వతీపురం మన్యం: పాముల పుష్పశ్రీవాణి
విజయనగరం: చిన్నశ్రీను
శ్రీకాకుళం: ధర్మాన కృష్ణదాస్
ఇదీ చదవండి: ఆ చోరీతో నాకెలాంటి సంబంధం లేదు.. ఏ విచారణకైనా సిద్ధం: మంత్రి కాకాణి