APGEA letter to CS Sameer sharma: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. సీఎస్‌కు లేఖ రాసింది. ఇవాళ సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిసి ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి ఆస్కార్ రావులు విజ్ఞాపన పత్రాన్ని అందించారు.
ఉద్యోగులకు మేలు జరగేలా నిర్ణయాలు లేవు
పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపును వ్యతిరేకిస్తున్నామని లేఖ ద్వారా తెలిపారు. పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చించినప్పటికీ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు రాలేదని పేర్కొంది. అసుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను.. ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని ఏపీజీఈఏ అభిప్రాయపడింది. 2010లోనే అప్పటి పీఆర్సీ సిఫార్సుల మేరకు 39 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 30 శాతమైనా ప్రకటించి ఉండాల్సిందని లేఖలో తెలిపారు.
పింఛనర్లకు అదనంగా 10శాతం ఇవ్వాలి
గత ప్రభుత్వం కూడా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని.. పొరుగు రాష్ట్రంలోనూ 30 శాతంగా పీఆర్సీ ఉందని తెలిపింది. వేతన సవరణ సంఘం సిఫార్సు చేసినట్టుగా.. ఇంటి అద్దె భత్యం, సీసీఏలు యథాతథంగా కొనసాగించాలన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి భత్యాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 70-79 ఏళ్ల పింఛనర్లకు అదనంగా 10 శాతం ఇవ్వాలని.. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు చెల్లించాలని ఏపీజీఈఏ లేఖ ద్వారా డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి: AP Emp Association On PRC: 'ఫిట్‌మెంట్‌పై అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే.. కానీ..'