Sailajanatha On BJP : హిందూత్వ ముసుగులో ప్రజలను విభజించేలా భారతీయ జనతా పార్టీ కొత్త నాటకానికి తెర తీసిందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. "సారాయి వీర్రాజు.. కోడిగుడ్ల వీర్రాజు.." సమాజాన్ని విభజించే మాటలు మానుకోవాలని హితవు పలికారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం తప్పని అన్నారు.
జిన్నా ఏం నష్టం చేశాడు?, ఏం మేలు చేశాడు? అనేది ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదని చెప్పారు. స్వాతంత్రోద్యమంలో వారి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి చదువుకోవాలని సూచించారు. దేశంలో ఉన్న అన్ని మతాల వారందరూ భారత మాత ముద్దు బిడ్డలని స్పష్టం చేశారు. సమాజాన్ని విభజించే మాటలకు సోము వీర్రాజు స్వస్తి పలకాలన్నారు.
గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు రావాల్సిన నిధులు, ఉత్తరాంధ్రకు ఇవ్వాల్సిన రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాల్సిన భాజపా నాయకులు వాటిని పక్కన పెట్టి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని శైలజానాథ్ ధ్వజమెత్తారు.
ప్రజల ఐక్యతను దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి తెస్తామని, జిన్నా టవర్ ను కూల్చేస్తామని ప్రకటనలు చేస్తే ప్రజలు ఓట్లు వేయరని విమర్శించారు. ఇలాంటి వారిని ప్రజాస్వామ్య బద్ధంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి : PRC Issue: ఉద్యోగుల ఆందోళనకు నేతృత్వం వహించటానికి సిద్ధం: భాజపా