సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపు ఉంటుందని... అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో వీవీ ప్యాట్ల ర్యాండమైజేషన్ ఉంటుందని చెప్పారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో దేశవ్యాప్తంగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం జరిగే అవకాశముందన్నారు.
ఒక్కో వీవీ ప్యాట్‌లో వెయ్యి ఓట్లు పోలయ్యే అవకాశం..
ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వీవీ ప్యాట్లు వినియోగించారని... ఒక్కో అసెంబ్లీ పరిధిలో 5, లోక్ సభ స్థానాల్లో 5 వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు ఉంటుందని ద్వివేది తెలిపారు. ఒక్కో వీవీ ప్యాట్‌లో సుమారు వెయ్యి ఓట్లు పోలయ్యే అవకాశముందన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1,750 వీవీ ప్యాట్ స్లిప్పుల్ని లెక్కించాల్సి ఉంటుందని చెప్పారు.
ఒక్కో అసెంబ్లీ ఫలితం వెల్లడికి ఐదారు గంటలు..
తొలుత అసెంబ్లీ ఫలితాలు వెల్లడిస్తామని, లోక్‌సభ ఫలితాలు జాప్యమయ్యే అవకాశం ముందని తెలిపారు. ఒక్కో వీవీ ప్యాట్ ఓట్ల లెక్కింపునకు సగటున గంట-గంటన్నర సమయం పట్టే అవకాశంముందని, ఒక్కో అసెంబ్లీ పరిధిలో ఒకదాని తర్వాత మరొక వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరుగుతుందన్నారు. ఆర్వో, అబ్జర్వర్‌లకు మాత్రమే ఓట్ల లెక్కింపు అధికార ముందని... ఒక్కో అసెంబ్లీ పరిధిలో ఫలితాల వెల్లడికి సగటున ఐదారు గంటలకు పైగా సమయం పడుతుందని చెప్పారు. ఈవీఎంలలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులు సరిపోయాకే ఫలితాల వెల్లడిస్తామన్నారు.