పోలవరంతో తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ముంపులో చిక్కుకుంటాయని కొందరు హరిత ట్రైబ్యునల్‌లో కేసు దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై నివేదిక సమర్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఎన్జీటీ కోరింది. ఈ నేపథ్యంలో పోలవరం అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ అయ్యర్ గురువారం వర్చువల్ విధానంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్ ఇంజినీరు సుధాకర్ బాబు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ పాల్గొన్నారు. కేంద్ర జలసంఘం నుంచి చీఫ్ ఇంజినీరు, కేంద్ర అటవీ పర్యాటకశాఖ అధికారి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మాట్లాడుతూ పోలవరంతో తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ముంపులో చిక్కుకుంటాయన్నారు. ఏపీ అధికారులు సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 15 నుంచి 29 వరకు రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు కలిసి సంయుక్త సర్వే చేశారని, ఆ నివేదిక కేంద్ర జలసంఘానికి సమర్పిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును డ్యాం భద్రత దృష్ట్యానే 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికి అనువుగా నిర్మిస్తున్నామని, ఇంతవరకు నది చరిత్రలో ఎన్నడూ అంత వరద వచ్చిన దాఖలా లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ అధికారులు స్పష్టం చేశారు. పర్యావరణ మదింపు అంచనా నోటిఫికేషన్ 2016 ప్రకారం ఆ నోటిఫికేషన్ వచ్చిన 45 రోజుల్లోగా ఒడిశా, ఛత్తీస్‌గడ్‌లు గ్రామసభలు నిర్వహించాల్సి ఉందని ఏపీ అధికారులు సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఒక వేళ వారు నిర్వహించకపోతే కేంద్రమే రెగ్యులేటరీ అథారిటీ ద్వారా ఇలాంటి సభలు నిర్వహించాల్సి ఉంటుందని ఏపీ ప్రస్తావించింది.
45.72 మీటర్ల స్థాయికి పునరావాసం పూర్తి చేయండి:
పోలవరం ప్రాజెక్టును 2022 ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేస్తామని చెబుతున్నందున ఆ లోపులోనే పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని పోలవరం అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. పోలవరంలో డ్యాం ఎత్తు 45.72 మీటర్ల స్థాయికి అవసరమైన పునరావాస, భూసేకరణ కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్దేశించారు.
ఇదీ చదవండి: రెమ్‌డెసివిర్ రవాణా చేస్తున్న విమానం క్రాష్ ల్యాండింగ్