మద్యం రాబడిని ఆదాయంగా చూపించి ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మరింత అప్పు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే 8వేల 300 కోట్లు రుణం తీసుకున్న ప్రభుత్వం.... మళ్లీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసి 25 వేల కోట్లు సేకరించనుంది. మార్కెట్‌లో అవసరమైన రుణాలు పొందేందుకు వీలుగా మద్యంపై ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ప్రత్యేక మార్జిన్‌ను విధించి వసూలు చేసుకునేలా ఇప్పటికే నిబంధనలు సడలించింది. ఇలా ప్రత్యేకంగా వసూలు చేసే మొత్తాన్ని ఆ కార్పొరేషన్ తన రాబడిగా చూపించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బెవరేజస్ కార్పొరేషన్ ప్రత్యేక మార్జిన్ వసూలు చేసుకునేందుకు వీలుగా మరో వెసులుబాటు కల్పిస్తూ.. మద్యంపై వ్యాట్‌ను తగ్గించింది. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గి బెవరేజస్ కార్పొరేషన్‌కు చేరే ఆదాయం పెరుగనుంది. ఈ ఆదాయంతో చేసిన అప్పులు తీర్చగలమంటూ కార్పొరేషన్ బాండ్లు జారీ చేసి రుణాలు సమీకరించనుంది. ఈ విధంగా ఇప్పటికే 8,300 కోట్లు కార్పొరేషన్ సమీకరించింది. దాదాపు 9.62 శాతం వడ్డీ చెల్లించేలా ఈ రుణం తీసుకుంది. మార్కెట్ వడ్డీరేటుకు మించి మరీ ఈ రుణం తీసుకున్నారు. తాజాగా తీసుకొనే 25 వేల కోట్లు ఏయే సంస్థల నుంచి తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై సమగ్రంగా లెక్కలు లేవు. 2021-22 ఆర్థిక సంవత్సరం లెక్కలు ఖరారు చేసే క్రమంలో కాగ్ సైతం అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అలాగే రాష్ట్రం తీసుకునే ఏ రుణమైనా ఆ ఏడాది రాష్ట్ర GSDP ఆధారంగా కేంద్రం నిర్ణయించిన రుణపరిమితికి లోబడి ఉండాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టంగా పేర్కొంది. 2021-22 లో రాష్ట్రం ఏ రూపేణా అప్పు తీసుకున్నా ఆ వివరాలన్నీ సమర్పించాల్సిందేనని కాగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి, తీసుకున్న అప్పుల వివరాలు సైతం అందించాలని కోరింది. మొత్తం అప్పుల వివరాలు సమర్పించడంలో రాష్ట్ర ఆర్థికశాఖ మీన మేషాలు లెక్కిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయియ. బహిరంగ మార్కెట్ రుణ పరిమితి విషయంలోనూ కేంద్ర ఆర్థికశాఖ షాక్ ఇవ్వడంతోనే 2021-22లో చేసిన మొత్తం రుణం వివరాలు వెల్లడించడం లేదు. దీంతో రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని పరోక్షంగా బెవరేజస్ కార్పొరేషన్‌కు మళ్లించి మరిన్ని అప్పులు పొందేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు తీర్చేందుకు సమగ్ర ప్రణాళిక లేదని, వాటిని తీర్చేందుకు మళ్లీ మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని కాగ్ సైతం హెచ్చరిస్తున్న విషయం గమనార్హం.
ఇవీ చూడండి