మాజీ నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలకు ఉపక్రమించింది. నిఘా పరికరాల కొనుగోలులో కుమారుడికి లబ్ధి కలిగేలా వ్యవహరించారంటూ 2020 ఫిబ్రవరి 8న ఏబీవీని సస్పెండ్ చేసిన ప్రభుత్వం దాన్ని పొడిగిస్తూ వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 180 రోజుల పాటు ఆయన సస్పెన్షన్‌ను కొనసాగిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కాలపరిమితి ముగియడంతో రెండ్రోజుల క్రితం మరికొంత కాలం పొడిగిస్తూ రహస్య ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఏబీవీని సర్వీసు నుంచే తొలగించాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. జులై 23నే ఈ ప్రతిపాదనలను పంపించింది. ఏరోస్టాట్, యూఏవీల కొనుగోలు కాంట్రాక్టు తన కుమారుడి కంపెనీకి దక్కేలా వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని లేఖలో ప్రభుత్వం ఆరోపించింది. ఆ పరికరాల నాణ్యత, సాంకేతిక సామర్థ్యం, గ్యారంటీ, వారంటీ తదితర అంశాలతో పాటు కొనుగోలు నియమావళి పాటింపు అంశాల్లో ఏబీవీ రాజీపడ్డారని కేంద్రానికి రాసిన లేఖలో ప్రభుత్వం వెల్లడించింది.
ఇజ్రాయెల్ సంస్థ ఆర్‌టీ ఇన్‌ఫ్లాటబుల్, ఆబ్జెక్ట్స్ లిమిటెడ్‌కు భారత్‌లో ప్రతినిధిగా తన కుమారుడు సీఈవోగా వ్యవహరిస్తున్న ఆకాశం అడ్వాన్స్‌డ్ లిమిటెడ్ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని తెలిపింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణలో ఈ రెండు విషయాలు నిరూపితమయ్యాయన్న ప్రభుత్వం..ఆకాశం అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలకు సంబంధించి పలు బ్యాంకు ఖాతాల్లో వివరాలు వెల్లడించని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని పేర్కొంది. వీటిపై దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్రానికి రాసిన లేఖలో వెల్లడించిన ప్రభుత్వం..ఏబీ వెంకటేశ్వరరావుపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరింది.
ఏబీవీపై నమోదైన మూడు కేసుల్లో రెండు రుజువు అయ్యాయంటూ జులై 31న రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్‌పీ సిసోడియా నివేదికతో పాటు, ఈ కేసుకు సంబంధించిన పలు పత్రాలను దానికి జతచేసింది. సాధారణ పరిపాలన శాఖ రాజకీయ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన విచారణను 2021 ఏప్రిల్ 30లోగా పూర్తిచేసి, తదుపరి తేదీలోగా విచారణ నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. కరోనా కారణంగా అఫిడవిట్ సమర్పించనందుకు క్షమాపణ కోరిన ఆయన..ఏబీవీపై నమోదైన అభియోగాలపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఇచ్చిన నివేదికను, దానిపై వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తర్వాత...ఆయనను సర్వీసు నుంచి డిస్మిస్ చేయాల్సిందిగా కోరుతూ కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిపారు.
ప్రతీకారం కోసమే నాపై అభియోగాలు: ఏబీ వెంకటేశ్వరరావు
ప్రతీకార చర్యల్లో భాగంగానే తనపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించి అభియోగాలు మోపిందని, ఎలాంటి ఆధారాలు లేకపోయినా అవి నిరూపణయినట్లు విచారణాధికారి ఏకపక్షంగా నివేదిక ఇచ్చారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అసత్య వివరాలతో ఉన్న దాన్ని తిరస్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. విచారణాధికారి ప్రభుత్వంతో శృతి కలిపి లేని ఆధారాలు ఉన్నట్లుగా పేర్కొనటంతో పాటు వాస్తవాల్ని వక్రీకరించి రెండు అభియోగాలు నిరూపణయినట్లు నివేదించారని తెలిపారు. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన మూడు అభియోగాల్లో రెండు నిరూపితమయ్యాయంటూ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై మే 18న ఏబీవీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇది తాజాగా వెలుగుచూసింది.
ఇదీ చదవండి..