రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైదరాబాద్ నుంచే విధులు నిర్వహించనున్నారు. తనకు భద్రత కల్పించాలని ఈ నెల 18న కేంద్రానికి లేఖరాసిన వెంటనే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తిరిగి విజయవాడ రాలేదు. ఈరోజు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయానికి వెళ్లి ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన ఫైళ్లను పరిశీలించి వాటికి ఆమోద ముద్ర వేశారు. ఏపీలో భద్రత లేదని కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నారు.
దీనిపై స్పందిచింన కేంద్రం ఇప్పటికే విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించింది. ఎస్ఈసీకి భద్రత కల్పిస్తామని ప్రకటించింది. ఇవాళ విజయవాడ వస్తారని ఇక్కడి అధికారులు భావించినా అలా జరగలేదు. కరోనా వైరస్ వల్ల తాను సామాజిక దూరం పాటిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. భద్రత కారణాల వల్లే విజయవాడకు రావడం లేదని తెలిసింది. ఆయన రాష్ట్రానికి ఎప్పుడు వస్తారనే విషయంపై తమకు స్పష్టత లేదని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: కరోనా ఎఫెక్ట్: దక్షిణ మధ్య రైల్వేలో 45 రైళ్లు రద్దు