రాష్ట్రంలో ఎయిడెడ్(aided) విద్యాసంస్థలను యథాతథంగా కొనసాగించాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని లెనిన్‌సెంటర్‌నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థిసంఘాల నాయకులు, ప్రతినిధులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్‌చేశారు. జీవోలు 42, 50, 51, 35లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్ఓ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఉదయం 10.30 గంటలకు లెనిన్ సెంటర్ నుంచి అసెంబ్లీకి వెళ్లాలని ఐకాస నిర్ణయించింది.
దీంతో నిన్నటినుంచే అన్ని విద్యార్థిసంఘాల కార్యాలయాలు, నాయకుల ఇళ్లవద్ద పోలీసులు నిఘా ఉంచారు. ఉదయం లెనిన్‌కూడలి వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాలు అసెంబ్లీకి వెళ్లేందుకు వీల్లేదని పోలీసులు నిలువరించడంతో రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ముఖ్యమంత్రి జీవోలను రద్దుచేసేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని అసెంబ్లీలో ఈ విషయమై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌చేశాయి.
ఎయిడెడ్ విద్యాసంస్థలను ఇదివరకు ఉన్న విధంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలువురు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ ప్రధాన మార్గం వరకు వచ్చి నినాదాలు చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంటే నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా అని కార్యకర్తలు మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రభుత్వ జీవోలు 42 ,50,51 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు, తెలుగుయువత నేతలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఎయిడెడ్ పై ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఛలో అసెంబ్లీకి బయలుదేరిన టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు, తెలుగు యువత నేతలను దొండపాడు వద్ద అసెంబ్లీకి వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరులో..
ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విద్యాసంస్థల విలీన జీవోలు వెనక్కి తీసుకోవాలంటూ గుంటూరులో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్జేడీ(RJD) కార్యాలయాన్ని ముట్టడించారు. ఇవాళ మధ్యాహ్నం జరగనున్న ఎయిడెడ్ అధ్యాపకుల బదిలీల కౌన్సిలింగ్‌ను అడ్డుకునే యత్నం చేయగా... పోలీసులు రంగప్రవేశం చేయడంతో తోపులాట జరిగింది. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా తమ పోరాటం సాగిస్తామని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మా పాఠశాల మాకే ఉంచండి.. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ విద్యార్థుల ఆందోళనలు