జిల్లాల్లో పని చేసే ఉద్యానవన శాఖ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పిచాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. నర్సరీల అభివృద్ధి, రిజిస్ట్రేషన్, నియంత్రణ అంశాలపై సమీక్షించారు. రైతుకి ఆర్థిక ప్రయోజనాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని మంత్రి తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ రైతుల కోసం సుమారుగా రూ.83 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. ఉద్యానవన శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలపై మంత్రి ఆరా తీశారు. కొబ్బరి సాగుపై ప్రత్యేక దృష్టిపెట్టేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రైతులకు తోటబడి శిక్షణ..
సూక్ష్మ సేద్య పరికరాల పంపిణిని అక్టోబర్ 1వ తేదీ నుంచే ప్రారంభించనున్నట్టు మంత్రి వెల్లడించారు. బోర్ల కింద వరి సాగు చేయని, గతంలో ఈ పథకం క్రింద లబ్ధిపొందని రైతులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నియమించిన గ్రామ ఉద్యాన శాఖ సహాయకులకు పూర్తిస్థాయిలో సాంకేతిక శిక్షణ ఇవ్వాలన్నారు. రైతులకు తోటబడి శిక్షణ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు.
ఇదీ చదవండి..
CBN-Gorantla: చంద్రబాబుతో గోరంట్ల భేటీ..రాజీనామా నిర్ణయం వెనక్కి