HC on construction of court building: విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు భవన సముదాయ నిర్మాణం ఆలస్యం కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణ జాప్యం, ఓ ఫ్లోర్‌కు అనుమతులు పొందడంలో ఆలస్యంపై వివరణ ఇస్తూ రహదారులు, భవనాల శాఖ కార్యదర్శిని ఆదేశించింది. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. విజయవాడలోని కోర్టు భవన సముదాయ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని సవాలు చేస్తూ న్యాయవాది చేకూరి శ్రీపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపిస్తూ.. భవన నిర్మాణంతో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. కాంట్రాక్టర్ తరపు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నుంచి రూ .10 కోట్ల బకాయిలు కావాల్సి ఉందన్నారు. ఎనిమిదో అంతస్తు నిర్మాణానికి అనుమతులు లభించలేదన్నారు. అయినా నిర్మాణం కొనసాగిస్తున్నామన్నారు.
ప్రభుత్వ న్యాయవాది నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎనిమిదో అంతస్తుకు అనుమతి పొందాల్సి ఉందన్నారు. సీనియర్ న్యాయవాదినారాయణరావు స్పందిస్తూ.. ప్రస్తుత నిర్మాణ ఖర్చులు పెరిగాయన్నారు. మిగితా పనుల్లో రేట్లను పెంచుతున్న ప్రభుత్వం.. జ్యూడీషియల్ నిర్మాణాల విషయంలో పెంచడం లేదన్నారు. అంటరానివిగా చూస్తుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తమను ఎవరూ ముట్టుకోకుంటే తమకే మంచిదని వ్యాఖ్యానించింది. తమని అంటరానివారిగా చూసే వారిని తాము అదేవిధంగా చూస్తామని పేర్కొంది. కోర్టు భవనాల నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేసిందని గుర్తుచేసింది. వారికి చాంబర్లు కూడా లేవని పేర్కొంది . బెంచ్ పైనుంచి అన్ని విషయాలు మాట్లాడలేక పోతునామని తెలిపింది.
ఇదీ చదవండి:
HC on PRC: ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దు: హైకోర్టు