జీఎస్టీ బిల్లుల చెల్లింపుల్లో వచ్చిన ఫిర్యాదులతో విజయవాడలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కార్యాలయంలోని పలు దస్త్రాలను పరిశీలించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలోని తాగునీటి ప్రాజెక్టు పనుల గుత్తేదారులు ఏసీబీకి చేసిన ఫిర్యాదులతో ఈ దాడులను చేపట్టారు. తాము చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీలో అక్రమాలు జరిగాయని గుత్తేదారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బిల్లులు ఇవ్వడానికి డబ్బులు అడుగుతున్నారని చెప్పారు. అలాగే వ్యక్తిగత అవసరాలకు డబ్బు తీసుకుని.. ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.
దీంతో విజయవాడ అనిశా అదనపు ఎస్పీ మహేశ్వరరాజు నేతృత్వంలోని సిబ్బంది ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయంలో తనిఖీలు చెపట్టారు. కార్యాలయంలోని పలు వోచర్లు, జీఎస్టీ రికార్డులను అధికారులు పరిశీలించారు. ఈఈ సాయినాథ్ సెలవులో ఉండగా.. ఉద్యోగుల నుంచి స్టేట్మెంట్లను తీసుకున్నారు. ఫిర్యాదు చేసిన గుత్తేదారులనూ.. కార్యాలయంలోనే విచారించారు. జీఎస్టీ సొమ్ము చెల్లింపుల్లో తేడాలు, దారి మళ్లింపుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పరిశీలిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: జగన్ అక్రమాస్తుల కేసు: సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ