వైరస్ సోకినా లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని కొవిడ్ చికిత్స కేంద్రాల్లోని వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని కొవిడ్ చికిత్స కేంద్రాల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి కృష్ణబాబు తెలిపారు. ఈ కేంద్రాల్లో మంచినీరు, మరుగుదొడ్ల ఏర్పాటు, ఈసీజీ, ఎక్స్‌రే, రక్త పరీక్షల ఏర్పాట్లకు జిల్లాకు రూ.కోటి వంతున విడుదల చేశామన్నారు. సమీపంలోని కొవిడ్ ఆస్పత్రులకు 15 నిమిషాల ప్రయాణ దూరంలో వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు వస్తే.. కొవిడ్ ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులనూ సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం 23 కేంద్రాల్లో 2,280 మంది ఉన్నారని పేర్కొన్నారు.
గుత్తేదారులకు చెల్లింపులు
'గడిచిన రెండు రోజుల్లో క్వారంటైన్ కేంద్రాలు, కొవిడ్ చికిత్స కేంద్రాల్లో ఉన్నవారికి భోజనం, ఇతర సౌకర్యాలపై తృతీయపక్షంతో అధ్యయనం చేయించాం. గుత్తేదారులకు జూన్ 30 వరకు ఉన్న బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భోజనం ప్యాకింగ్‌లో ఐర్‌సీటీసీ సలహాలు, సూచనలు పొందాం. భోజనం తయారీలో నాణ్యత, ఇతర ప్రమాణాలు పాటించని వారికి మెమోలు ఇస్తాం. వచ్చే వారం నాటికి పరిస్థితుల్లో మార్పు రాకుంటే జరిమానా, ఇతర క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రాల్లో 9,421 మంది ఉన్నారు.
వైరస్ ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక
విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి రోజూ 13-15 వేల మంది వస్తున్నారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఇంతకుముందు తెలంగాణ, కర్ణాటక లేవు. ఇప్పుడు అవీ ఆ జాబితాలోకి వెళ్లాయి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చేవారిలో 10% మందికి ర్యాండమ్‌గా పరీక్షలు చేస్తున్నాం. మిగిలిన వారి చిరునామా, ఇతర వివరాలను ఎ.ఎన్.ఎం, సచివాలయ సిబ్బందికి పంపుతున్నాం. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చినవారు రెండు వారాలు ఇళ్లలోనే ఉండాలి.
గల్ఫ్ నుంచి తిరుపతికి విమానాలు..
గల్ఫ్ దేశాల నుంచి తిరుపతి విమానాశ్రయానికి విమానాలు వచ్చేలా ప్రయత్నిస్తున్నాం. గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారిలో కడప, చిత్తూరు, ఇతర జిల్లాలవారు ఎక్కువగా ఉంటున్నారు' అని కృష్ణబాబు వివరించారు.