ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతికి చేరుకోనున్నారు. ఉదయం వాయుసేన విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి రానున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో గాదంకి సమీపంలోని జాతీయ వాతావరణ పరిశోధనా సంస్థ (ఎన్ఏఆర్ఎల్) ను సందర్శిస్తారు. పర్యటనలో భాగంగా అక్కడి శాస్త్రవేత్తలతో వెంకయ్య సమావేశమవుతారు. సంస్థలోని విభాగాల పనితీరును పరిశీలిస్తారు. రాడార్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్, డాటా సెంటర్, హెచ్ఎఫ్ రాడార్ పనితీరును శాస్త్రవేత్తలు ఉపరాష్ట్రపతికి వివరిస్తారు. అనంతరం తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుని.. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక తిరుమలకు పయనమవుతారు. రాత్రికి తిరుమల పద్మావతి అతిథి గృహంలో బస చేసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఉపరాష్ట్రపతి మంగళవారం మొత్తం తిరుమలలోనే గడుపుతారు. బుధవారం ఉదయం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎన్ఏఆర్ఎల్, తిరుపతి, తిరుమలలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇది కూడా చదవండి.