అల వైకుంఠపురం తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. ఏకాదశి పర్వదినాన అర్థరాత్రి తర్వాత తిరుమల శ్రీవారికి ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించిన అర్చకులు శాస్త్రోక్తంగా...వైకుంఠ ద్వారం తెరిచారు. అర్థరాత్రి దాటిన తరువాత శ్రీవారి ఆలయ తలుపులు తెరచి... ధనుర్మాస పాశురాలను పారాయాణ చేస్తూ స్వామివారిని మేల్కొల్పారు. వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వైకుంఠ ద్వారాలను తెరిచారు. జీయంగార్లు, అర్చకులు తోమాలలతో వైకుంఠ ద్వార ప్రదక్షిణగా సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక ధనుర్మాస కైంకర్యాలు, నివేదనల సమర్పణ అనంతరం... నిత్యకైంకర్యాలు, శుక్రవారాభిషేకం నిర్వహించారు. మూలమూర్తికి విశేష తిరువాభరణాలను, పరిమళభరిత పూలమాలలతో తోమాల సేవను నిర్వహించి...భక్తులను దర్శనానికి అనుమతించారు.
తెల్లవారుజామున మూడున్నర నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్ పొందిన భక్తులు, తితిదేకు విరాళాలు అందచేసిన దాతలకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఎనిమిది గంటల తర్వాత ప్రత్యేక ప్రవేశ, సర్వదర్శన టికెట్లు ఉన్న సాధారణ భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ.బోబ్డేతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు శ్రీవారిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తితిదే నిర్వహించిన స్వర్ణరథోత్సవం వైభవంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి స్వర్ణ కిరీటాలు, మరకత మాణిక్యాలతో కూడిన స్వర్ణాభరణాలను ధరించి స్వర్ణరథంపై ఆసీనులై తిరుమాఢ వీధుల్లో విహరించారు. తిరువీధుల్లో ఊరేగుతూ అభయప్రదానం చేసిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి స్వర్ణ రథాన్ని మహిళలు లాగారు. కరోనా నేపథ్యంలో ముందుగా కొవిడ్ పరీక్షలు నిర్వహించుకొన్న తితిదే మహిళా ఉద్యోగులు 200 మందిని మాత్రమే బంగారు తేరు వద్దకు అనమతించి రథోత్సవాన్ని నిర్వహించారు.
ప్రముఖులు, అత్యంత ప్రముఖులు పూర్తి స్థాయిలో సహకరించడంతో అనుకొన్న సమయం కంటే గంటన్నర ముందుగా సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శన కల్పించగలిగామని తితిదే అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవాణిట్రస్టు, దాతలు, ప్రముఖులతో కలిపి ఏడు వేల మందికి వీఐపీ దర్శనాలు కల్పించామన్నారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో పరిస్థితిని సమీక్షించి మరిన్ని ప్రత్యేక ప్రవేశదర్శనం, సర్వదర్శనం టోకెన్ల జారీకి చర్యలు చేపడతామన్నారు.
ద్వాదశి సందర్భంగా శనివారం వేకువజామున శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వరాహ పుష్కరిణి చెంత శ్రీవారి చక్రతాళ్వార్లకు అభిషేకాదులు నిర్వహించి... చక్రసానం చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి చక్రస్నాన క్రతువును ఏకాంతంగా నిర్వహించనున్నారు.
ఇదీచదవండి
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తజనం