తిరుమల శ్రీవారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన ఆస్తుల్లో నిరర్థకంగా ఉన్న వాటిని ఏం చేయాలన్న అంశమై తితిదే విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. తమిళనాడులోని కొన్ని ఆస్తులను వేలం వేసే దిశలో ఇటీవల దేవస్థానం తీసుకున్న చర్యలు వివాదాస్పదమైనందున తితిదే భవిష్యత్తు కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశం కానుంది. లాక్‌డౌన్ కారణంగా పొరుగురాష్ట్రాల్లోని సభ్యుల హాజరుకు అవకాశం లేనందున తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా దర్శనాలను నిలిపివేసినందున కోల్పోయిన ఆదాయాన్ని పూడ్చుకోవడం, లాక్‌డౌన్ తర్వాత భక్తుల ఆలయ ప్రవేశానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం చర్చించనుంది. తిరుపతిలో గరుడవారధి నిర్మాణానికి నిధుల కేటాయింపుపైనా చర్చించనుంది.
ఇవీ చదవండి: 'శ్రీశైలం దేవస్థానం అవినీతిపై సమగ్ర దర్యాప్తు'