శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సమయ నిర్దేశిత- టైమ్‌స్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించాలని తితిదే నిర్ణయం తీసుకుంది. కరోనాకు ముందు దివ్యదర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లతో పాటు... దర్శన టికెట్లు లేని భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా దర్శనాలకు అనుమతించేవారు. కొవిడ్ కారణంగా 2020 మార్చి నుంచి దర్శన విధానాలను పూర్తిగా మార్చేశారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టేకొద్దీ దర్శనాలను పెంచుతూ వచ్చిన తి.తి.దే... కరోనాకు ముందున్న విధానాలను కొన్నింటిని పునరుద్ధరించలేదు. సాధారణ పరిస్థితులు నెలకొన్నా... కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న రోజుల తరహాలోనే దర్శన టికెట్ లేని భక్తులను తిరుమలకు అనుమతించలేదు. దీనివల్ల తిరుపతిలో పరిమితంగా జారీ చేస్తున్న సర్వదర్శన టోకెన్ల కౌంటర్ల వద్ద ఇటీవల తొక్కిసలాట జరిగింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తి.తి.దే తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో... టైమ్‌స్లాట్ దర్శన టోకెన్ల జారీని పూర్తిగా రద్దు చేసి భక్తులందరినీ తిరుమలకు అనుమతించింది.
ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు తొలగించడంతో భక్తుల సంఖ్య పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో కరోనా పూర్వ విధానాలు అమలు చేయాలని తి.తి.దే నిర్ణయించింది. తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని ప్రారంభించడంతో పాటు... దివ్యదర్శన టోకెన్ల జారీ ప్రారంభంపై పునరాలోచన చేస్తోంది. కరోనాకు ముందు దివ్యదర్శనం, సర్వదర్శనం ద్వారా దాదాపు 45 వేల టోకెన్లు జారీ చేసేవారు. అంతే స్థాయిలో ఇప్పుడు జారీ చేయడంతో పాటు... తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చదవండి: Tirumala: తిరుమలలో కిలోమీటర్ల మేర బారులు తీరిన భక్తులు