దిక్కుతోచని స్థితిలో 1200 కుటుంబాలు
ప్రపంచ దేశాల్ని గజగజవణికిస్తున్న కరోనా మహమ్మారి... చిన్నా, పెద్ద అని తేడాలేకుండా ప్రతీ వ్యాపార రంగాన్ని చిన్నాభిన్నం చేసింది. చిత్రపటాల తయారీ పరిశ్రమపై ఆధారపడి తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లో సుమారు 1200 కుటుంబాలు ఉన్నాయి. దేవుళ్ల ప్రతిరూపాలను చేతితో అందంగా తీర్చిదిద్దటం, ప్రింట్ చేయటం, ఫ్రేమ్ తయారు చేయటం, మనోహరమైన వర్ణాలు అద్దడం, అందమైన రాళ్లతో అలంకరించటం, లైటింగ్ సెట్ చేయటం, ఫ్రేమ్ ఫిట్టింగ్, ప్యాకింగ్ ఇలా వివిధ దశల్లో కొన్ని వేల మంది తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
ప్రింటింగ్ ప్రెస్‌లు, ఫ్రేమ్ వర్క్స్, చిత్రపటాల విక్రయ దుకాణాలు ఇలా ప్రతీవారిపై... కరోనా ప్రభావం పడింది. సుమారు రెండున్నర నెలలుగా వ్యాపారాలు లేక కుటుంబ పోషణ భారమైందని చిత్రకారులు, దుకాణదారులు వాపోతున్నారు. సడలింపుల తర్వాత దుకాణాలు తెరిచినా.....చిత్రపటాల విక్రయాలు కొనుగోళ్లు లేకపోవటంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని అంటున్నారు.
పది శాతానికి పడిపోయిన ఆదాయం
గతంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం రోజుకు కనీసం లక్ష మంది భక్తులు వచ్చేవారు. వారంతా స్వామి వారి దర్శనం తర్వాత...అక్కడే ఏర్పాటు చేసిన దుకాణాల్లో దేవతా మూర్తుల పటాలను కొనుగోలు చేసేవారు. గతంలో నెలకు సుమారు రూ. 40 లక్షల వ్యాపారం జరిగేదని, ఒక్కో కుటుంబం 30 నుంచి 40 వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జించేవారని దుకాణదారులు అంటున్నారు. తిరుపతి నగరంలో సుమారు 35 వేల నుంచి 40వేల మంది చిత్రపట పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.
చిత్తపటాలను తమిళనాడులోని చెన్నై, తంజావూరు, కర్ణాటకలోని బెంగళూరు, హైదరాబాద్‌లకు ఎగుమతి చేసేవారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఇక్కడి నుంచి చిత్రపటాలను కొనుగోలు చేసి బహుమతులుగా ఇచ్చేవారు. వీఐపీలకు తిరుపతి నుంచి తీసుకువెళ్లిన స్వామి వారి పటాలను అందించటం పరిపాటి. కానీ కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పుడదంతా పూర్తిగా మారిపోయింది. చెన్నై లాంటి ప్రధాన మార్కెట్ లాక్డౌన్లో ఉండటంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఆర్డర్లు లేకపోవటంతో చాలా దుకాణాలు మూతపడ్డాయి. గతంతో పోలిస్తే కనీసం 10 శాతం వ్యాపారం జరగడంలేదని వ్యాపారులు అంటున్నారు.
యాత్రికులు, భక్తులపైనే ఆధారపడి జీవించే తామంతా కరోనా ప్రభావంతో...గతంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని చిత్రపటాల తయారీ, విక్రయదారులు వాపోతున్నారు. తరతరాలుగా ఇదే వ్యాపారంలో కొనసాగుతున్నందున దుకాణాలను వదులుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మంచిరోజుల వస్తాయన్న ఆశతో బతుకు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : 'పార్టీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు'