Students missed in Swarnamukhi: ఈత సరదా వారికి శాపంగా మారింది. కూలి పనులు చేస్తూ బిడ్డలను ప్రయోజకుల్ని చేయాలనుకున్న వారి కలలు కలగానే మారాయి. మండలంలోని జీపాళెం వద్ద స్వర్ణముఖి నదిలో ఆదివారం ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతు కాగా ఒకరు మృతి చెందారు. మరో విద్యార్థి సురక్షితంగా బయటపడ్డాడు. జీపాళెం ఎస్సీ కాలనీకి చెందిన నాగరాజు, అనురాధ దంపతులు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారుడు ధోని(17) రేణిగుంటలో ఐటీఐ చదువుతున్నాడు. జయశంకర్, జయలక్ష్మి ప్రైవేట్ పరిశ్రమలో కార్మికులిగా పని చేస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు జయ గణేష్(14) 10వ తరగతి చదుతున్నాడు. వెంకటసుబ్బయ్య, చిరంజీవమ్మకు కుమార్తె, కుమారుడు. వీరి కుమారుడు యుగంధర్(14) 9వ తరగతి చదువుతుండగా.. చిరంజీవమ్మ తిరుపతి నగరపాలక సంస్థలో ఒప్పంద కార్మికురాలిగా పని చేస్తోంది. లోకేష్ కూలి పనులు చేస్తున్నారు. సుజాత పాకశాస్త్ర కళాశాలలో స్వీపర్‌గా పని చేస్తోంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుమారుడు లిఖిత్‌సాయి(14) 9వ తరగతి చదువుతున్నాడు. జయగణేష్, యుగంధర్, లిఖిత్‌సాయి ముగ్గురు పాపానాయుడుపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. వీరు నలుగురు గ్రామానికి ఆనుకుని ఉన్న స్వర్ణముఖినదిలో ఆదివారం ఉదయం ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. గమనించిన జాలర్లు లిఖిత్‌సాయిని సురక్షితంగా ఓడ్డుకు చేర్చారు. స్థానికులు గాజులమండ్యం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాసులు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందానికి సమాచారం అందించడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. జయ గణేష్ మృత దేహాన్ని వెలికి తీయగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. తమ కుమారుల ఆచూకీ తెలపాలంటూ కుటుంబ సభ్యుల రోద]నలు ఆ ప్రాంతానికి వచ్చిన వారిని కలిచివేశాయి. ప్రమాదం నుంచి బయటపడిన లిఖిత్‌సాయి మాట్లాడుతూ ‘సంఘటన జరిగిన వెంటనే తాను బెండ్ పట్టుకుని తిరిగి దానిపై ఎక్కానని’ తెలిపాడు.
ఉద్ధరిస్తావనుకుంటే.. ఉసురు తీసుకున్నావా నాయనా
‘నాయనా విజయ్.. ఎంతపని చేశావురా.. మమ్మల్ని ఉద్ధరిస్తావని ఆశలు పెట్టుకున్నాం కదరా.. చివరకు అనాథల్ని చేశావు కదరా తండ్రీ.. అన్నాచెల్లీ వచ్చారు చూడరా నాయనా.. లేరా విజయ్.. మాతో ఒకసారి మాట్లాడరా.. రెండుమూడ్రోజుల్లో ఇంటికి వస్తానని ఇలా ఎందుకు చేశావు స్వామీ’.. అంటూ విజయ్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కడప జిల్లాకు చెందిన విజయ్ ఆర్వీఎస్ కళాశాలలో ఇంజినీరింగ్ ఈసీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మృతుడికి అన్న, చెల్లెలు ఉన్నారు. అన్న బీటెక్ చేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉన్నాడు. చెల్లికి పెళ్ళైంది. వ్యవసాయ కుటుంబమే అయినా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని తండ్రి ఇంత దూరం పంపారు. ముగ్గురు పిల్లల్లో విజయ్ అంటేనే తల్లిదండ్రులకు ఎంతో ఇష్టం. ఇంటి వద్ద ఉంటే గడప దాటని వాడు.. ఈతకు ఎందుకు వెళ్లావురా నాయనా అంటూ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి : Students Letter to Principal for watching PUSHPA: సార్...పుష్ప సినిమాకి...మీకూ ఓ టిక్కెట్ ఉంది ..