ద్విచక్రవాహనాలను చోరి చేసే ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.11 లక్షల విలువ చేసే 17 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.... తిరుపతి నగరంలోని వైకుంఠపురం ఆర్చి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా... ద్విచక్ర వాహనాల చోరీ గుట్టు బయటపడినట్లు పేర్కొన్నారు.
విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని... ఆరుగురు సభ్యులతో కూడిన ముఠా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో బైక్లను చోరీ చేసినట్లు గుర్తించామని చెప్పారు. చోరీలకు పాల్పడుతున్న ముఠాలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. జీడి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు నగరాలకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పట్టుబడిన వారిలో కొంతమందిపై తిరుపతి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.