తిరుపతి ఉపఎన్నిక సమీపిస్తున్నందున తెలుగుదేశం ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేలా కార్యాచరణ రూపొందించుకుంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్ ఇతర సీనియర్ నేతలు తిరుపతిలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా.. రేపట్నుంచి అధినేత చంద్రబాబు ప్రచార బరిలోకి దిగనున్నారు. రాత్రికి తిరుపతి చేరుకోనున్న ఆయన.. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. శ్రీకాళహస్తి నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడుతో పాటు.. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో ప్రచారానికి చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
వైఫల్యాలే అస్త్రాలుగా...
తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని గెలవాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం.. మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి..అందుకు తగ్గట్టుగానే శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా.. తిరుపతి నగరపాలక సంస్థలోని డివిజన్ల వారీగా పార్టీ సీనియర్ నాయకులను ఇన్‌ఛార్జులుగా నియమించింది. ప్రభుత్వ వైఫల్యాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్న తెలుగుదేశం.. యువనాయకుల సేవల్ని వినియోగిస్తోంది. తెదేపా హయాంలో తిరుపతికి ఐఐటీ, ఐజర్, ఐఐడిపి వంటి ప్రముఖ విద్యాసంస్థలు వచ్చాయని వివరిస్తోంది. సోమశిల, కండలేరు కాలవల విస్తరణ కార్యక్రమాలు చేపట్టిన తీరును ప్రచారంలో ప్రస్తావిస్తోంది. ప్రశ్నించే గొంతుకను గెలిపించాలంటూ నేతల ప్రచారం చేస్తున్నారు.
ఈ నెల 15తో ప్రచార పర్వం ముగియనుండగా.. అధినేత చంద్రబాబు 14 వరకు తిరుపతి ప్రచార పర్వంలోనే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి