తిరుమల గిరుల్లో రోజూ నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే... శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వివాదాలకు కేంద్రమవుతోంది. తిరుమల శ్రీవారు, తిరచానూరు పద్మావతి అమ్మవారి ఉత్సవాలు, సేవలతో పాటు సుందరకాండ పారాయణం, నాదనీరాజనం వేదికగా సాగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు చేరువ చేయటమే లక్ష్యంగా ఎస్వీబీసీ పనిచేస్తుంది. రోజులో పదిహేడు గంటలు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుంది. మరో నాలుగు గంటలపాటు శతమానంభవతి, శుభోదయం, నాదతరంగాలు, గురుదేవోభవ వంటి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది రూపకల్పన చేసే కార్యక్రమాలను ప్రసారం చేస్తారు.
క్షేత్రస్థాయిలో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంలో కెమెరా, సాంకేతిక విభాగాల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారు. మూడు గంటల పాటు ప్రసారం చేసే రికార్డెడ్ కార్యక్రమాల రూపకల్పనకు మాత్రమే ఇతర సిబ్బంది అవసరం ఉంటుంది. ఈ మూడు గంటల కార్యక్రమాల కోసం వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అవసరాలకు మించి సిబ్బంది ఉండటంతో పనిలేని ఉద్యోగులు... ఇతర వ్యాపకాల్లో మునుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల శతమానంభవతి కార్యక్రమంలో ప్రసారమైన తమ దృశ్యాలను పంపాలన్న ఓ భక్తుడికి అశ్లీల చిత్రాలతో కూడిన లింక్ పంపటం తీవ్ర దుమారం రేపింది.
ఎస్వీబీసీలో ప్రొడక్షన్, సాంకేతికత, ఎడిటోరియల్, యాంకరింగ్ వంటి అన్ని విభాగాల్లో కలిపి 248 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వార్షిక నిర్వహణ వ్యయం 18 కోట్ల రూపాయలు ఉండగా... సిబ్బంది జీతాలు ఇతర భత్యాలు కలిపి 15 కోట్ల రూపాయల వరకూ చెల్తిసున్నారు. కేవలం మూడు గంటల పాటు ప్రసారం చేసే రికార్డెడ్ కార్యక్రమాలకు వందల మంది సిబ్బంది, కోట్ల రూపాయల జీతం చెల్లింపుపై విమర్శలు వస్తున్నాయి. భక్తులు హుండీలో వేసే సొమ్ము వినియోగంపై... తితిదే నియంత్రణ లేకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఇదీ చదవండీ... ఎస్వీబీసీలో అటెండర్ తొలగింపు.. కారణం అదే!