కొవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవన్ నుంచి ముఖ్యమంత్రి జగన్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించారు. ప్రస్తుతం గ్రామాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోందని.. నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రధానికి వివరించారు. దేశంలోనే అత్యధిక కొవిడ్ నిర్ధారణ పరీక్షలు ఏపీలో జరుగుతున్నాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 10 శాతం మందికి కొవిడ్ పరీక్షలు చేశామని చెప్పారు. కరోనా వైరస్ తీవ్రస్థాయి విపత్తు అయినప్పటి నుంచి.. రాష్ట్రంలో వైద్యపరంగా మౌలిక సదుపాయాలను.. అంతర్జాతీయ స్థాయిలో మెరుగుపర్చుకున్నామని ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు గణనీయంగా తగ్గిందని సీఎం జగన్ ప్రధానికి తెలిపారు.
ఈ ఏడాది మార్చి ఆరంభంలో ఒక్క టెస్ట్ కూడా చేయలేని స్థితి నుంచి 10 లక్షల జనాభాకు 98 వేల నిర్ధారణ పరీక్షలు చేసే స్థాయికి చేరుకున్నామని....రోజువారీగా 50 వేల నుంచి 60 వేల పరీక్షలు చేస్తున్నామని.. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని సీఎం తెలిపారు. 13 జిల్లాల్లోని 248 ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్ చికిత్స కోసం కేటాయించామని.. మొత్తంగా 38 వేల 197 పడకలు, 4 వేల 467 ఐసీయూ పడకలు సిద్ధం చేసినట్లు వివరించారు. 458 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్లు ప్రధానికి సీఎం తెలిపారు.
శ్రీవారిని దర్శనం అయింది
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుమల శ్రీనివాసుడి దర్శనం అయిందన్న సంతోషం కలిగిందని ప్రధాని మోదీ అన్నారు. సీఎం జగన్ మాట్లాడుతున్న సమయంలో ఆయన వెనక స్వామివారి పెద్ద చిత్రపటం ఉండటంతో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవంలో పాల్గొనడానికి వచ్చి కూడా... వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం అభినందనీయమన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని ప్రజలకు త్వరితగతిన సేవలు అందుతున్నాయని ప్రధాని అన్నారు. ఈ విధానాన్ని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయని మోదీ తెలిపారు.
ఇదీ చదవండి : శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్