Pawan Kalyan comments: ఎక్కడైనా మూడో ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. న్యాయస్థానంలోనూ సింగిల్ జడ్జి, త్రిసభ్య ధర్మాసనం, ఐదుగురి ధర్మాసనం ఉంటాయని తెలిపారు. అందువల్ల రాష్ట్రానికీ, దేశానికీ మూడో ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అటు తెలుగుదేశానికి ఇటు వైకాపాకు కొమ్ము కాసేందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. తిరుపతిలోని ఒక కళ్యాణ మండపంలో జనవాణి, జనసేన భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు బాధితులు ఆయనను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.
"రాష్ట్రంలో కూడా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. వైకాపాకు, తెదేపాకు కొమ్ము కాసేందుకు మేం సిద్ధంగా లేం. సమాజంలో మార్పు కోసం ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటాం. కులం అంటే పిచ్చి మమకారం నాకు లేదు. వైకాపా నేతలు మంచి చేస్తున్నారో లేదో చెప్పాల్సింది మేం.. వాళ్లు కాదు. అందరూ చేతులు కట్టుకోవాలని కోరుకోవడమే ఆధిపత్య ధోరణి." - పవన్, జనసేన అధినేత
PAWAN ‘కొందరు వైకాపా నేతలు నేను తెదేపాకు అనుకూలంగా ఉన్నట్లుగా విమర్శిస్తున్నారు. 2014లో తెదేపాకు ఎందుకు మద్దతు ఇచ్చామనేది అందరికీ తెలియాలి. 2009ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయంగా చిరంజీవి ఆధ్వర్యంలో పార్టీ వచ్చినప్పుడు.. చాలామంది వెనుకబడ్డ కులాలు, అభ్యుదయ భావాలున్న అగ్రవర్ణాలవారూ మద్దతుగా నిలవడంతో గొప్ప మార్పును ఆశించాం. దురదృష్టవశాత్తు కొందరు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి కోవర్టులుగా మారిపోయారు. వారిలో కొందరు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. కుళ్లు, కుట్ర రాజకీయాలతో చిరంజీవిని నిలబడనీయకుండా చేశారు. దీంతో మార్పు వచ్చే వరకూ ఉంటే ఉంటాను.. పోతే పోతాను తప్ప ఎవరికీ లొంగనని నాడు పంతం పట్టాను. మేము ఏం చేయాలని నాతోపాటు ఉన్న కొందరు అడిగితే ఏ పార్టీలోకి వెళ్లినా అభ్యంతరం లేదు.. నేను మాత్రం మార్పు కోసం నిలబడతానని స్పష్టం చేశాను. అన్నయ్య మంత్రిగా ఉన్నప్పుడు నేను దిల్లీ వెళ్లలేదు. ఆ రోజు నన్ను చాలామంది బెదిరించారు. అప్పటి ముఖ్యమంత్రి కూడా నువ్వు రావాలని చాలా సంకేతాలు పంపించారు. నేను ఎవరికీ భయపడనని వారికి స్పష్టంగా చెప్పాను.
2014లో తెదేపాకు మద్దతు ఇవ్వాలని పార్టీని ప్రారంభించలేదు. రాష్ట్ర విభజన జరుగుతోంది. నాటి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోదీని.. మేము సొంత రాష్ట్రంలో పరాయివాళ్లం అయిపోతామా అని అడిగాను. మీ లాంటి వ్యక్తి ప్రధాని కావాలని మద్దతు ప్రకటించాను. ఇదే సమయంలో తెదేపా నాయకులు రెండు మూడు సార్లు కబురు పంపినా నేను మాట్లాడలేదు. మేం తెదేపాతో కలిసి వెళుతున్నాం.. నువ్వు మద్దతు ఇవ్వాలని మోదీ కోరారు. ఆయన మాటను గౌరవించి ఆ రోజున చంద్రబాబుకు ఒకటే చెప్పాను. రాజకీయపరంగా కులం చూస్తారు. నేను కులాన్ని గౌరవిస్తాను కానీ పిచ్చి మమకారం లేదు. మీకు నా మద్దతు కావాలంటే మా కార్యాలయానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని అడిగాను. నేను పోటీ చేయకుండా మద్దతు ఇవ్వాలంటే మా కార్యకర్తలను గౌరవించాలని కోరాను. నాడు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకుండా ఉన్నట్లైతే మూడో ప్రత్యామ్నాయంగా ఉండేది. మనం నిలబెట్టుకోలేక, అటు తెదేపాను రానీయకపోవడంతో ఒక చిన్న గందరగోళం ఏర్పడింది. ఆ తప్పును సరిదిద్దుకునేందుకే బేషరతుగా మద్దతు ఇచ్చాను’ అని పవన్‌కల్యాణ్ వివరించారు.
వైకాపాకు ఇస్తే ఓకేనా..
‘తెదేపాకు కొమ్ముకాస్తున్నారని కొందరు మాట్లాడుతున్నారు. వైకాపాకు మద్దతు ఇస్తే ఇప్పుడు మీకు ఓకేనా. మేం విడిగా పోటీ చేస్తే మీకు ఓకేనా. 2019లో ఒంటరిగానే పోటీ చేశాం. ఈ రోజు ఎవరితో పోటీ చేస్తామనేది నిర్ణయం తీసుకోలేదు. ఇంత విధ్వంస పూరిత రాజకీయాలు చేస్తున్నప్పుడు శత్రువులతోనూ కలుస్తాం.. ఇందులో అనుమానానికీ తావు లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కలుస్తామంటే మర్యాదపూర్వకంగా గౌరవం ఇచ్చినప్పుడు. మా వాళ్లను గౌరవించని చోట ముందుకు వెళ్లను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మద్దతిస్తాను.
ఆంధ్రా థానోస్ అని నామకరణం..
రాష్ట్రానికి ఈ రోజు ఒక బలమైన యువ నాయకుడు ఉన్నారు.. (జగన్‌ను ఉద్దేశించి)ఆయన పేరు ఏమిటి.. ఆ పేరు పలకడం ఇష్టం లేదు. అవెంజర్స్ సినిమాలో థానోస్ అనే వ్యక్తి ఉంటాడు. తాను మానవాళికీ మంచి చేస్తున్నానని అనుకుంటూ సగం మందిని చంపేస్తాడు. నేను మంచే చేస్తున్నా కదా అని అనుకుంటాడు. నువ్వు మంచి అనుకుంటే ఎలా? అది మేం చెప్పాలి కదా.. అలాగే మన ఆంధ్రా వైకాపా థానోస్ అందరినీ చంపేస్తున్నాడు. నన్ను దత్తపుత్రుడు అని అంటున్నాడు.. కాబట్టి నేను ఆయనకు ఆంధ్రా థానోస్ అని నామకరణం చేస్తున్నాను.
మీ ముందు చేతులు కట్టుకోవాలా..
రాయలసీమలో చూసింది ఒక్కటే ఆధిపత్య పోరు. అలా కుదరదు మార్పు వస్తుంది. ప్రభుత్వ సలహాదారు సజ్జలకు చెబుతున్నా మీ ఆధిపత్య ధోరణి అంటే ఇతరులను బతకనివ్వకపోవడం... మీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలనుకునేదే ఆధిపత్య ధోరణి అంటే. మీ కోటలోకి ప్రవేశించాలంటే దిగి నడుచుకుంటూ రావాలి. ఎంత పెద్ద హీరోలు అయినా సరే మా దగ్గరకు నడుచుకుంటూ రావాలనుకున్నదే మీ ఆధిపత్య ధోరణి.. ఎంతో సాధించిన వాళ్లను, ఆత్మగౌరవంతో తిరిగిన వాళ్లనూ అలా చూస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి..?
వైకాపా రాకూడదు..
వైకాపా రాకూడదన్నదే మా విధానం. ద్వేషపూరిత రాజకీయాలు చేస్తూ అందరినీ చావకొడుతుంటే కచ్చితంగా రాకూడదని కోరుకుంటాం. రాయలసీమలో వైకాపా నాయకులు దళితుల గొంతు బలంగా నొక్కేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలపైనే బైండోవర్ కేసులు పెడుతున్నారు. సీమ ప్రజల్లో చైతన్యం రావాలి. రాయలసీమలో ఫ్యాక్షనిజం నాకు కనిపించదు. అత్యధిక గ్రంథాలయాలు ఇక్కడే ఉండేవి. పులివెందులలో సరస్వతి గ్రంథాలయం ఉంది. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని తెలంగాణ పార్టీ నేతలు కోరారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేద్దాం అన్నాను’ అని పవన్ కల్యాణ్ తెలిపారు. కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులు, కొందరు మహిళలకు ధన సహాయం చేశారు.
జనవాణిలో సమస్యల వెల్లువ
*తిరుపతి వేదికగా జనసేన నాలుగో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం జరిగింది. ఇందులో రాయలసీమ ఉమ్మడి జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా నుంచి ప్రజలు తరలివచ్చి 415 వినతులను పవన్ కల్యాణ్‌కు అందజేశారు.
*చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వేపనపల్లిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పథకాలపై ప్రశ్నించిన యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేయడంపై వారి తల్లిదండ్రులు జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌కు విన్నవించారు. ఆయన స్పందిస్తూ.. ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు దీనిపై స్పందించకపోతే సీఎం క్యాంపు కార్యాలయం ముందు బైఠాయిస్తానని హెచ్చరించారు.
* నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఎ.ఎస్.పేట మండలం పెద్దబ్బిపురంలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ప్రశ్నిస్తే 95 మామిడి చెట్లను నరికేశారని వెంగయ్య అనే బాధితుడు ఆవేదన చెందారు.
* చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లికి చెందిన భాగ్యమ్మ మాట్లాడుతూ.. తన పెద్ద కుమారుడు హరీష్‌ను అక్కడి వైకాపా నాయకుడు రాధాకృష్ణ వాహనంతో ఢీకొట్టి చంపేశాడని ఆవేదన చెందారు.
ఇవీ చూడండి