కష్టాలు ఎన్ని రకాలు ఉంటాయో.. అవన్నీ పరిచయం చేసింది... కరోనా. ఆ వైరస్ ప్రభావం వల్ల మనుషులే కాదు మూగజీవాలు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నాయి. లాక్‌డౌన్ కాలంలో వీధిశునకాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కరోనాకు ముందు హోటళ్లు, రెస్టారెంట్లలో మిగిలిన పదార్థాలతో ఆకలితీర్చుకునే వీటికి ఆహారం కరువైంది. అలాంటి మూగజీవాలను అక్కున చేర్చుకుని ఆహారం అందిస్తోంది.. తిరుపతికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఉదయశ్రీ.
అలా ప్రేమ పెంచుకుంది...
ఉదయశ్రీ చిన్నతనం నుంచి తల్లిదండ్రులు, తాత, బామ్మలు వీధుల్లో తిరిగే ఆవులు, కుక్కలు, ఇతర జంతువులకు ఆహారం పెట్టడం గమనించింది. తానూ అదే పని చేస్తూ వాటిపై ప్రేమ పెంచుకుంది. కొంతకాలం కిందట బాణాసంచా పేలి శరీరానికి గాయమై నడవలేని స్థితిలో ఉన్న ఒక వీధికుక్కను చేరదీసింద. వైద్యమందించి మాములు స్థితికి తెచ్చింది. వీధిశునకాలపై అలా మెుదలైన ఆమె వాత్సల్యం రోజులు గడిచేకొద్దీ పెరుగుతూ వచ్చింది. తిరుపతిలోని పలు వీధుల్లోని వాటి ఆలనాపాలనా చూడటం దినచర్యగా మార్చుకుంది.
పేరు పెట్టి పిలుస్తూ..
దాదాపు దశాబ్ధకాలంగా వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్న ఉదయశ్రీ...శునకాలను సైతం వారు, వీరు అంటూ తోటి మనుషుల్లానే పిలుస్తుంది. ఉదయం, సాయంత్రం వాటికి స్వయంగా ఆహారం తీసుకెళ్లి వడ్డిస్తోంది. ఆమెని చూడగానే పెంపుడు జంతువుల తరహాలోనే వీధి కుక్కలు తోకాడించుకొంటూ వెంట తిరుగుతుంటాయి. పేరుపెట్టి మరీ వాటిని పిలుస్తూ ఉదయశ్రీ వాటికి కావాల్సిన ప్రేమను పంచుతోంది.
తిరుపతిలోని భవాని నగర్, అశోక్ నగర్, అలిపిరి బైపాస్ రోడ్డు, కపిల తీర్థం రోడ్డు, ఇస్కాన్ టెంపుల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వందల వీధి కుక్కలకు ఉదయశ్రీ ఆహారం అందిస్తోంది. ఎవరి సాయం కోసమో ఎదురుచూడకుండా ఉన్న ఆర్థిక వనరులతోనే వాటికి ఆహారం సిద్ధం చేస్తోంది. ఉదయం 8 గంటల లోపు.. సాయంత్రం 7 గంటలకు క్రమం తప్పకుండా ఆటోలో వెళ్లి ఆయా ప్రాంతాల వీధి శునకాలకు ఆహారం ఇస్తోంది.
బ్లూ క్రాస్ సహకారంతో వైద్యం
2014లో బీటెక్ పూర్తి చేసిన ఉదయశ్రీ... చెన్నై టీసీఎస్‌లో ఉద్యోగంలో చేరింది. 3 ఏళ్లు పని చేశాక...మూగజీవాల సంరక్షణపై దృష్టి సారించింది. తల్లిదండ్రులతో కలిసి వీధి కుక్కలు, ఆవులు, ఇతర జంతువులను ఆదరిస్తోంది. ఆహారమే కాక గాయపడిన జంతువులకు ప్రాథమిక వైద్యసేవలు అందిస్తోంది. ఎక్కడైనా గాయపడిన వీధి కుక్కలు, ఆవులు కనిపిస్తే బ్లూ క్రాస్ సంస్థ సహకారంతో వైద్యం అందేలా చర్యలు చేపడుతోంది.
వీధుల్లో ఉండే మూగజీవాలను ఆదుకొనే క్రమంలో ఇరుగు పొరుగు నుంచి ఇబ్బందులు ఎదుర్కొంది...ఉదయశ్రీ. వీధికుక్కలు, ఇతర జంతువులు గాయపడతాయన్న భావనతో చిన్నతనం నుంచి దీపావళికి దూరంగా ఉంటోంది. మనుషుల మాదిరిగానే జంతువులకూ మనసు ఉంటుందని.. వాటికి నచ్చినట్లు జీవించే స్వేచ్ఛకు ఆటంకం కలిగించకూడదని సూచిస్తోంది. ఖరీదైన పెంపుడు శునకాలతో పాటు వీధికుక్కలను ఆదరించే రోజులు రావాలని ఆకాంక్షిస్తోంది.
ఉన్నత ఉద్యోగం సైతం వదిలి..
మూగజీవాల ఆలనాపాలనా కోసం టీసీఎస్ లాంటి ప్రముఖ సంస్థలో ఉద్యోగం వదులుకున్న ఉదయశ్రీ... మూగ జీవాలకు మెరుగైన సేవలు అందించడం కోసం డిప్లమో ఇన్ వెల్ఫేర్ కోర్సు చేస్తోంది. పాడైన ఆహారం, మురికి నీరు తాగడం వల్ల వీధి జంతువులు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆమె...ప్రతి ఒక్కరూ ఒక జంతువును దత్తత తీసుకునేలా చేయటమే లక్ష్యంగా సేవాకార్యక్రమాలు చేపడుతోంది.
ఇదీ చదవండి: